
వీధి కుక్కలపై విషప్రయోగం
ఐదు కుక్కలు మృతి
పెనమలూరు: కానూరులో గుర్తు తెలియని వ్యక్తి వీధి కుక్కలపై విషప్రయోగం చేయటంతో ఐదు కుక్కలు మృత్యు వాతపడ్డాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. కానూరు వరలక్ష్మిపురం 4వ లైన్‌లో మాన్విత అపార్టుమెంట్ వద్ద వీధి కుక్కలు నివసిస్తున్నాయి. వీధి కుక్కలకు స్థానికులు ర్యాబిస్ వాక్సిన్ వేసి, కుక్క పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించి చెవులకు గుర్తు కూడా వేశారు. వాటి పోషణ స్థానికులే చూస్తున్నారు. అయితే బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి కుక్కలపై విషప్రయోగం చేశాడు. దీంతో ఐదు కుక్కలు అక్కడికక్కడే మృతి చెందా యి. మరో ఐదు కుక్కల పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు కుక్కలను పశువుల డాక్టర్ వద్దకు తీసుకువెళ్లి చికిత్స చేయిస్తున్నారు. ఈ ఘటనపై డి.జ్యోతి పోలీసులకు గురువారం ఫిర్యాదు చేసింది. మృతి చెందిన కుక్కలకు పోలీసులు పోస్టుమార్టం చేయించగా విషప్రయోగం జరిగినట్లు నిర్థారణ అయింది. పోలీసులు అపార్టుమెంట్ వద్ద ఉన్న సీసీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు.