
బంగారు కుటుంబాలకు మార్గదర్శిగా రెడ్‌క్రాస్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో పీ–4 విధానంలో ఎంపికైన బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేందుకు రెడ్‌క్రాస్ ముందుకొచ్చిందని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. రాజరాజేశ్వరిపేటకు చెందిన 278 బంగారు కుటుంబాలను రెడ్‌క్రాస్ కమిటీ దత్తత తీసుకోనుందన్నారు. ఇదే స్ఫూర్తితో పారిశ్రామిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ఎన్నారైలు ముందుకు రావాలని కోరారు. బంగారు కుటుంబాల ఉన్నతికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ పత్రాన్ని జిల్లా కమిటీ చైర్మన్ డాక్టర్ జి.సమరం, కమిటీ సభ్యులతో కలిసి మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ లక్ష్మీశకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పేదరికాన్ని సమాజం నుంచి దూరం చేయాలని ప్రభుత్వం పీ4 విధానాన్ని తీసుకొచ్చిందన్నారు. బంగారు కుటుంబా ల్లోని పిల్లలకు నాణ్యమైన విద్య, వైద్య సేవలు అందించేందుకు రెడ్‌క్రాస్ కృషిచేయనుందని తెలిపారు. ఒక సచివాలయం పరిధిలోని అన్ని బంగారు కుటుంబాలను లేదా మొత్తం మండలాన్ని కూడా దత్తత తీసుకోవచ్చని సూచించారు. జిల్లాలో 86 వేల బంగారు కుటుంబాలు ఉన్నాయని, ఇప్పటికే 400 మందికి పైగా మార్గదర్శులు ముందుకొచ్చా రని తెలిపారు. పేద కుటుంబాలను మార్గదర్శులు తమ కుటుంబాలుగా భావించి పేదరికం నుంచి బయటపడేందుకు కృషిచేయాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ జిల్లా కమిటీ వైస్ చైర్మన్ డాక్టర్ వెలగా జోషి, కార్యదర్శి ఇ.చిట్టిబాబు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ