
అమరావతి సక్సెస్ కాదు!
మధురానగర్(విజయవాడసెంట్రల్): అమరావతి ఎప్పటికీ సక్సెస్ కాదని.. మూరెడు మట్టి తవ్వితే.. బారెడు నీళ్లు వస్తున్నాయని.. ఇటువంటి పరిస్థితులలో 50 అంతస్తుల భవనాలు ఎలా నిర్మిస్తారో చంద్రబాబుకే తెలియాలని కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చింతామోహన్ విమర్శించారు. విజయవాడ గాంధీ నగర్‌లోని ప్రెస్ క్లబ్‌లో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను అమరావతికి వ్యతిరేకం కాదని, కానీ అమరావతిలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు సంతోషంగా లేరని అన్నారు. రాజధానికి కేవలం 30 కిలోమీటర్‌ల దూరంలోనే గన్నవరంలో ఎయిర్‌పోర్టు ఉండగా ఇప్పుడు 5వేల ఎకరాలలో ఎయిర్‌పోర్టు నిర్మించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికే గుంటూరు, విజయవాడ ట్విన్ సిటీస్‌గా అభివృద్ధి చెంది ఉన్నాయని.. వాటిని మరింత అభివృద్ధి చేయాల్సిన కూటమి ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. అమరావతి రాజధానికి 20 జిల్లాల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని గుర్తు చేశారు.
విద్యా వ్యవస్థ నిర్వీర్యం..
1987లో రాజీవ్ గాంధీ దేశ వ్యాప్తంగా ప్రాథమిక విద్యను అందుబాటులోకి తీసుకువచ్చారని చింతా మోహన్ చెప్పారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో 35వేల పాఠశాలలు ఏర్పాటు చేశారన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే ఏకంగా 5వేల పాఠశాలలు మూసివేసిందని.. మరో 5వేల పాఠశాలలు మూసిసేందుకు రంగం సిద్ధం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లికి వందనం ప్రహసనంగా మారిందని విచారం వ్యక్తం చేశారు. అప్పట్లో ఇందిరాగాంధీ ఇచ్చిన స్కాలర్‌షిప్‌లనే ఇప్పుడు తల్లికి వందనం అంటూ ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
బడాబాబులకే ‘ఉపాధి’
ఉపాధి హామీ పథకం బడాబాబుల జేబులు నింపుతోందని చింతామోహన్ విమర్శించారు. గతంలో 90 శాతం కూలీలకు 10 శాతం మెటీరియల్‌కు ఉపాధి హామీ పథకంలో ఖర్చు చేసేవారన్నారు. కానీ ఇప్పుడు 90 శాతం మెటీరియల్‌కు 10 శాతం కూలీలకు మార్చి వేసి జేబులు నింపుకుంటున్నారని విమర్శించారు.
మూరెడు మట్టి తవ్వితే.. బారెడు నీళ్లొస్తున్నాయి ఏడాదిలో 5వేల పాఠశాలలు మూసివేశారు మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్