
పండ్ల తోటల పెంపకానికి ప్రోత్సాహం
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
తిరువూరు: ఉపాధి హామీ పథకంలో ఉచితంగా పండ్ల తోటల పెంపకం చేపట్టే రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహాన్నిస్తోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. గంపలగూడెం మండలం గోసవీడులో ఉద్యాన పంటల పెంపకం గ్రౌండింగ్ మేళాను మంగళవారం ఆయన ప్రారంభించారు. అందులో భాగంగా మామిడిమొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ మాట్లాడుతూ పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం చేపట్టే పలు పథకాలు సత్ఫలితాలిస్తున్నాయన్నారు. ఉపాధి హామీ పథకంలో ఉచితంగా మొక్కలు పంపిణీ చేయడంతో పాటు పెంపకం బాధ్యతలు నిర్వహించే వారికి ఆర్థిక సాయం లభిస్తుందన్నారు. మామిడి, జామ, నిమ్మ, సపోట, దానిమ్మ, డ్రాగన్ ఫ్రూట్, కొబ్బరి, ఆయిల్‌పామ్, ఆపిల్ బేర్, మునగ, మల్లె, గులాబీ తోటల పెంపకానికి సన్న, చిన్నకారు రైతులు, 5 ఎకరాల లోపు భూమి కలిగినవారు అర్హులని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 4వేల ఎకరాల్లో పళ్లు, పూల తోటల పెంపకం లక్ష్యంగా తీసుకున్నట్లు తెలిపారు. తిరువూరు ఆర్డీవో మాధురి, డ్వామా పీడీ ఎ.రాము, ఏపీడీ పార్థసారధి, డ్వామా జిల్లా ప్లాంటేషన్ మేనేజర్ కె.ఉష పాల్గొన్నారు.