
ప్రమాదాల నివారణకు స్టాప్.. వాష్.. రిఫ్రెష్ అండ్ గో
లబ్బీపేట(విజయవాడతూర్పు): అర్థరాత్రి సమయాల్లో...వేకువ జామున జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు నగర పోలీసులు ‘స్టాప్.. వాష్.. రిఫ్రెష్ అండ్ గో ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నగర పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు మాచవరం మహానాడు రోడ్డులో, సత్యనారాయపురం శారద కళాశాల సమీపంలో, భవానీపురం గొల్లపూడి హైవే, తిరువూరు హైవే, జి.కొండూరు హైవే సమీపంలో పోలీసు అధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెల్లవారు జామున 2 నుంచి 5 గంటల వరకూ నిద్రమత్తులో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నందున, ఆ సమయంలో పోలీసులు వాహనాలను ఆపి నీళ్లతో ముఖం కడుక్కుని నిద్రమత్తు వీడేలా చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇలా చేయడం ద్వారా చాలావరకూ ప్రమాదాలను నివారించవచ్చునని పోలీసులు తెలిపారు.
నేరాలపై పూర్తి స్థాయిలో నిఘా
సీసీఎస్ సిబ్బందికి కృష్ణా ఎస్పీ దిశానిర్దేశం
కోనేరుసెంటర్: సీసీఎస్ సిబ్బంది సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవాలని జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు తెలిపారు. జిల్లాలోని సీసీఎస్ అఽధికారులు, సిబ్బందితో మంగళవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ఏడాది ఇప్పటివరకు నమోదైన కేసులు, ప్రాపర్టీ రికవరీలు, నేరస్తులకు పడిన శిక్షలు తదితర అంశాలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సిబ్బంది సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకోవటంతో పాటు నేరాలపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టాలన్నారు. దొంగతనాలు, చైన్ స్నాచింగ్ నేరాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. తాళం ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడే వారిని పసిగట్టి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. నూతన టెక్నాలజీని ఉపయోగిస్తూ నేరాల నియంత్రణకు కృషి చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో విహారయాత్రలకు, బంధువుల ఇళ్లకు వెళ్లవలసి వస్తే ముందస్తు సమాచారం పోలీసులకు తెలియపరిస్తే గస్తీ ఏర్పాటు చేస్తామని ప్రజలకు తెలియజేస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. శిక్షలు అనుభవించి జైలు నుంచి విడుదల అయిన పాత నేరస్తులపై నిఘా ఉంచి, వారి కదలికలను గమనిస్తూ ఉండాలన్నారు. శాంతిభద్రతలకు విఽఘాతం కలిగేలా వ్యవహరిస్తే ఉక్కుపాదం మోపాలన్నారు. నేరస్తులను గుర్తించడంలో, నేరాలు అదుపు చేయడంలో సీసీ కెమెరాల పాత్ర ప్రధానమైందన్నారు. నేరం జరిగేందుకు అవకాశం ఉన్న ప్రతి ప్రదేశంలో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సీసీ కెమెరాలు ఉపయోగంలో ఉన్నదీ లేనిదీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలన్నారు. అపార్ట్‌మెంట్‌లు, వ్యాపార వాణిజ్య సముదాయాలు, జనం రద్దీగా ఉండే ప్రదేశాలలో సీసీ కెమెరాలు అమర్చుకునేలా యజమానులతో మాట్లాడాలన్నారు.