
రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రాగా మార్చారు
కూటమి ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజం
గన్నవరం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులపాలు చేసి దివాళా తీసే పరిస్థితికి తీసుకువచ్చిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు. సీసీఐ 26వ జిల్లా మహాసభల్లో భాగంగా మంగళవారం కృష్ణాజిల్లా గన్నవరం మూడుబొమ్మల సెంటర్‌లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ జగన్ హయాంలో చేసిన అప్పులపై గగ్గోలు పెట్టిన చంద్రబాబు ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చుతున్నారని మండిపడ్డారు. గడిచిన ఏడాదిలోనే రాష్ట్ర అవసరాల పేరుతో రూ.లక్ష కోట్లు, అమరావతి రాజధాని కోసం రూ.31 వేల కోట్లు అప్పులు తెచ్చారని చెప్పారు. రాజధాని నిర్మాణాల కోసం మరో రూ.30 వేల కోట్లు అప్పులు తెచ్చేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో కూడా చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని చెప్పారు. హామీలు అమలు గురించి ప్రశ్నిస్తే మాత్రం ఖజానా ఖాళీగా ఉందని చెప్పడం సిగ్గుచేటన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చేవరకు సీపీఐ పోరాడుతుందన్నారు. గతంలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబు, లోకేష్ ఇప్పుడు ఎందుకు సమర్ధిస్తున్నారని, పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించడంపై కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని రామకృష్ణ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం విధానాల వల్ల దేశంలో పేదరికం, నిరుద్యోగం పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం కార్పొరేట్ శక్తులు, పెట్టుబడిదారులకు మాత్రమే ప్రధాని నరేంద్రమోదీ లబ్ధి చేకూర్చుతున్నారని ఆరోపించారు. చివరికి అంబేద్కర్ రచించిన లౌకిక రాజ్యాంగాన్ని కూడా మార్చేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ఈ పరిస్థితుల్లో దేశాన్ని కాపాడుకునేందుకు లౌకికవాదులతో కలిసి కమ్యూనిస్టులు ఉద్యమిస్తారని స్పష్టం చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శి నార్ల వెంకటేశ్వరరావు అధ్యక్షతన సీపీఐ రాష్ట్ర నాయకులు కేవీవీ ప్రసాద్, దుర్గాభవాని, అడ్డాడ ప్రసాద్, దోనేపూడి శంకర్, జి.కోటేశ్వరరావు, పెద్దు వాసుదేవరావు, కాట్రగడ్డ రామచంద్రజోషి తదితరులు పాల్గొన్నారు.