
మధుమేహుల్లారా...టీబీ కేర్‌ఫుల్
లబ్బీపేట(విజయవాడతూర్పు): మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో క్షయ ముప్పు పొంచి ఉంది. వారిలో ఇమ్యూనిటీ తక్కువగా ఉండటంతో క్షయ త్వరగా వ్యాప్తి చెందుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇప్పటివరకూ శరీరంలో చక్కెర స్థాయిలు అదుపులో లేని వారికి గుండె, కిడ్నీ, కంటి రెటీనా దెబ్బతిని చూపు కోల్పోవడం వంటి విషయాలు అందరికీ తెలిసినవే. తాజాగా వాటి జాబితాల్లో క్షయ వ్యాధి కూడా చేరింది. మధుమేహుల్లో క్షయ వ్యాధి సోకుతున్న వారు పెరుగుతున్నట్లు అధ్యయనాల్లో తేలింది. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఇటీవల కాలంలో మధుమేహుల్లో క్షయ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారు. క్షయ వ్యాధి నివారణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆర్‌టీపీసీఆర్ కేంద్రాలకు వస్తున్న రోగులే అందుకు నిదర్శనం. సాధారణ వ్యక్తుల్లో క్షయ వ్యాధి సోకితే క్రమం తప్పకుండా మందులు వాడితే పూర్తిగా నివారించవచ్చు. మధుమేహులకు క్షయ సోకితే ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఒకప్పుడు హెచ్‌ఐవీ ఉన్న వారిలో క్షయ వ్యాధి ఎక్కువగా వచ్చేదని, ఇప్పుడు వారి కంటే మధుమేహుల్లో ఈ శాతం పెరగడం ఆందోళన కలిగించే అంశంగా వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మధుమేహ వ్యాధిగ్రస్తులు క్షయ వ్యాధి సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.
నెలకు వందకు పైగానే...
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని క్షయ వ్యాధి నిర్ధారణ కేంద్రాల్లో నమోదవుతున్న క్షయ కేసుల్లో మధుమేహులు వంద మందికి పైనే ఉంటారనేది అంచనా. ఆర్‌ఎన్‌టీసీపీ కేంద్రాలకు రోజులో ఒకరిద్దరు మధుమేహంతో క్షయ వ్యాధి సోకి చికిత్స కోసం వస్తుంటారని నివేదికలు చెబుతున్నాయి. ఆరోగ్యంగా ఉన్న వారి కంటే మధుమేహుల్లో క్షయ వ్యాధి సోకే అవకాశం ఐదు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు.
చక్కెర వ్యాధిగ్రస్తుల్లో పొంచి ఉన్న క్షయ ముప్పు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పెరుగుతున్న కేసులు ఒకసారి వచ్చి తగ్గినా మళ్లీ రిపీట్ అవుతున్న వైనం నెలలో వంద కేసులపైనే నమోదు
ఉమ్మడి కృష్ణాలో 5 లక్షలు పైనే...
ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఐదు లక్షల మందికి పైనే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు అంచనా. వారిలో 50 శాతం మంది మాత్రమే కచ్చితంగా మందులు వాడుతున్నారు. మరో 50 శాతం మందిలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండటం లేదనేది వైద్యుల మాట. అలాంటి వారిలో గుండె, కిడ్నీలు, లివర్, కంటి వ్యాధులతో పాటు, శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటం వలన క్షయ వ్యాధి సులభంగా సోకుతుందంటున్నారు. ప్రస్తుతం టీబీ ముఖ్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా హెచ్‌ఐవీ, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి టీబీ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నారు.