
ఇంజినీరింగ్ ప్రవేశాలు ప్రారంభం
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఇంజినీరింగ్ కోర్సుల కౌన్సెలింగ్ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఇటీవల విడుదల చేసింది. షెడ్యూల్‌ను జూలై 26వ తేదీ నాటికి పూర్తి చేసి, ఆగస్టు నాలుగో తేదీ నుంచి తరగతుల నిర్వహణకు చర్యలు చేపట్టనుంది. అందులో భాగంగా ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభించారు.
ఉమ్మడి జిల్లాలో 32 ఇంజినీరింగ్ కళాశాలలు
రాష్ట్రంలో అత్యధికంగా ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్న జిల్లాల్లో ఉమ్మడి కృష్ణాజిల్లా రెండో స్థానంలో ఉంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అత్యధికంగా 32 ఇంజినీరింగ్ కళాశాలలు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా, నూతన కృష్ణా జిల్లా పరిధిలో ఆయా కళాశాలలు ఉన్నాయి. 32 కళాశాలలకు సంబంధించి వివిధ బ్రాంచ్‌లలో సుమారు 19వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో సుమారుగా 15వేల వరకూ కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉన్నాయి. వీటికి కౌన్సెలింగ్‌ను నిర్వహించనుంది.
అందుబాటులోకి కొత్త కోర్సులు..
జిల్లాలో ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల్లో సీఎస్‌సీ, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్, సివిల్ వంటి రెగ్యులర్ కోర్సులకు తోడు ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి సీఎస్‌ఈలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ సైన్స్, బ్లాక్‌చైన్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డేటా సైన్స్, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, మైరెన్ మైనింగ్ వంటి కొత్త బ్రాంచులు అందుబాటులో ఉన్నాయి.
ఈఏపీ సెట్‌లో 29వేల మందికి పైగా..
గత నెలలో విడుదలైన ఏపీ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ పరీక్ష–2025 ఫలితాల్లో ఉమ్మడి కృష్ణాజిల్లాకు సంబంధించి 29,338మందికి పైగా క్వాలిఫై అయ్యారు. ఇక్కడ 19వేల సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే జిల్లాలో ఇప్పటికే కొంతమంది ఇంజినీరింగ్ విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లారు. కొందరు ఐఐటీ, ఎన్‌ఐటీ వంటి జాతీయస్థాయి ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరిపోయారు.
మూడు హెల్ప్‌లైన్ సెంటర్లు..
అభ్యర్థులకు సాంకేతిక సమస్యల పరిష్కారానికి, రిజర్వేషన్లకు సంబంధించి సలహాలు, సూచనలు ఇవ్వడానికి నగరంలోని ప్రభుత్వ పొలిటెక్నిక్ కళాశాల ప్రాంగణం, ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్, ఆంధ్రా లయోలా కళాశాలలో హెల్ప్‌లైన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
విజయవాడలో మూడు ప్రాంతాల్లో హెల్ప్‌లైన్ సెంటర్లు