
గవర్నర్ పర్యటన ఏర్పాట్లు పరిశీలన
ఆత్కూరు(గన్నవరం): ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్‌లో ఈ నెల 10న జరిగే వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ విచ్చేయనున్న నేపథ్యంలో జిల్లా అధికారులు సోమవారం ఏర్పాట్లను పరిశీలించారు. కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ నేతృత్వంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ, ఎస్పీ ఆర్. గంగాధరరావు, పలు శాఖల అధికారులు ట్రస్ట్‌లో భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు.
పర్యటన ఇలా..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గవర్నర్ పర్యటనలో ఎటువంటి అవాంతరాలు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ట్రస్ట్‌లోకి ప్రవేశించగానే స్వామివివేకానంద విగ్రహానికి గవర్నర్ పూలమాలలు వేస్తారని, ఆ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని చెప్పారు. ప్రవేశమార్గంలో పందిళ్లు, మొక్కల కుండీలు, కార్పెట్‌లు ఏర్పాటు చేయాలని, గ్రీన్‌రూమ్‌లో గవర్నర్ విశ్రాంతి కోసం సోఫా వంటి వసతులను కల్పించాలని ఆదేశించారు. విజయవాడ నుంచి స్వర్ణభారత్ ట్రస్ట్ వచ్చే మార్గంలో గవర్నర్ కాన్వాయ్ రాకపోకలకు ఎటువంటి ఆటంకం లేకుండా గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయాలన్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే స్నాతకోత్సవానికి ముందే విద్యార్థులను వారికి కేటాయించిన సీట్లలో కూర్చోబెట్టాలని చెప్పారు. ఉద్యాన విశ్వవిద్యాలయం డీన్ ప్రసన్నకుమార్, అసోసియేట్ డీన్ దొరాజీరావు, గుడివాడ ఆర్డీఓ జి. బాలసుబ్రహ్మణ్యం, డీపీఓ అరుణ, మెప్మా పీడీ సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.