
మత్తు వదిలేలా జరిమానాలు!
లబ్బీపేట(విజయవాడతూర్పు): అన్ని ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. మద్యం సేవించి పట్టుబడితే మందుబాబుల జేబులు ఖాళీ అవుతున్నాయి. రోడ్డు భద్రతా చర్యల్లో భాగంగా పోలీసులు హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలు తనిఖీలతో పాటు, మద్యం తాగి వాహనాల నడిపిన వారిని గుర్తిస్తున్నారు. ఇటీవల పెద్ద సంఖ్యలో అలాంటి వారు పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతున్నారు. ఒకసారి జరిమానా కట్టిన వారు మళ్లీ మద్యం సేవించి రోడ్డు మీదకు రావడానికి భయపడేలా జరిమానాలు విధిస్తున్నారు. అంతేకాదు పోలీసుల తనిఖీల్లో ఎంత మోతాదులో మద్యం సేవించారో నిర్ధారణ అయిన దానిమేరకు జరిమానాలు విధిస్తున్నారు.
ఒకే రోజు 280 మందికి జరిమానాలు
నగరంలోని 1,3,5,6 ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో 280 మంది మద్యం సేవించి డ్రైవ్ చేస్తున్నట్లు గుర్తించారు. వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా 100 ఎంఎల్ కంటే ఎక్కువ మద్యం సేవించిన 9 మందికి రూ.15 వేలు చొప్పున జరిమానా విధించారు. మిగిలిన 271 మందికి రూ.10 వేలు చొప్పున జరిమానా వేశారు. ఇలా ఒకే రోజు రూ.28.45 లక్షలు జరిమానాలు విధించారు.
ఈ నెల 3న కూడా 25 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారిలో ఐదుగురికి రూ.15 వేలు చొప్పున, 20 మందికి రూ.10 వేలు జరిమానాలు విధించారు. ఇలా మద్యం సేవించి పట్టుబడిన వారి జేబులు ఖాళీ అవుతున్నాయి.
ప్రమాదాల నివారణ కోసమే...
మద్యం తాగి వాహనాలు నడుపుతుండటంతో జరిగే రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. వాహన చోదకులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే తమతో పాటు ఎదుటి వ్యక్తి ప్రాణాలకు సైతం ముప్పు ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. దీంతో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని నివారించే లక్ష్యంతోనే తనిఖీలు చేస్తున్నారు.
వారి కదలికలపై నిఘా
పోలీసుల తనిఖీల్లో భాగంగా అసాంఘీక శక్తులపై కూడా నిఘా పెంచుతున్నారు. రౌడీలు కేడీలు, బాడ్ ఎలిమెంట్స్ ఉన్న వారి ఫోటోలు, వేలి ముద్రలు , వివరాలు సేకరిస్తున్నారు. అలాంటి వారు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి వాహనాలపై తిరుగుతున్నట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు నిర్వహించే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో అలాంటి వారిని సైతం గుర్తిస్తున్నారు. అంతేకాకుండా సివిల్ పోలీసులు సైతం వారి కదలికలపై నిఘా ఉంచుతున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే రూ.10 వేలు ఫైన్ 100 ఎంఎల్ కంటే ఎక్కువ తాగితే రూ.15 వేలు జరిమానా శనివారం ఒక్కరోజే 280 మందికి రూ.28.45 లక్షలకు పైగా ఫైన్ అసాంఘిక శక్తులపై ప్రత్యేక దృష్టి అంటున్న సీపీ
అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం
నగరంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపనున్నాం. అలాంటి వారిపై నిఘా ఏర్పాటు చేశాం. వారి వివరాలను సేకరిస్తున్నారు. ప్రతిరోజూ ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నాం. పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. వాహన చోదకులు ట్రాఫిక్ నియమ నిబంధనలు, మోటార్ వాహన చట్టాలను పాటిస్తూ సురక్షితంగా ప్రయాణం చేయాలి.
–ఎస్వీ రాజశేఖరబాబు,
పోలీస్ కమిషనర్, ఎన్టీఆర్‌జిల్లా