
అన్ని కోణాల్లో నరసింహరాజు కేసు దర్యాప్తు
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): ఆదిత్య ఫార్మసీ చైర్మన్ సాగి వెంకట నరసింహరాజు మరణానికి ఆర్థిక ఇబ్బందులే కారణమా.. లేక ఇతర ఒత్తిళ్లు.. ఇతరత్రా ఇబ్బందులు ఇంకా ఏమైనా ఉన్నాయా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆదిత్య ఫార్మసీ చైర్మన్ నరసింహరాజు విజయవాడలో శనివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై నరసింహరాజు సతీమణి శాంతి ఇచ్చిన ఫిర్యాదు మేరకూ కేసు నమోదు చేసిన పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.
సూసైడ్ నోట్, కాల్‌డేటా ఆధారంగా
నరసింహరాజు రాసిన సూసైడ్ నోట్‌తో పాటు ఆయన కాల్‌డేటాను, నగరానికి వచ్చిన దగ్గర నుంచి ఆయన ఎవరెవరిని కలుసుకున్నారు, ఎవరెవరు ఆయన్ను బెదిరించి నొత్తిళ్లు తీసుకువచ్చారనే విషయాలను రాబడుతున్నారు. నరసింహరాజుకు అప్పులిచ్చిన వారిలో ఎవరు అతని ఇంటి మీదకు, ఆ కంపెనీల వద్దకు వచ్చి గొడవలు చేశారని విచారణ చేస్తున్నారు. నరసింహరాజు సూసైడ్ నోట్‌లో రాసిన.. ఆయన సతీమణి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న విజయవాడకు చెందిన ఆడిటర్ పిన్నమనేని పరంధామయ్య, వైజాగ్ ప్రాంతానికి చెందిన ఫార్మా కంపెనీకి చెందిన బుద్దరాజు శివాజీల పాత్ర ఏమిటి, వారు ఎవరెవరి ద్వారా వారిపై ఒత్తిళ్లు తీసుకువచ్చారు. వారికి సహకరించిన పెద్ద తలకాయలు ఎవరు.. వారిలో ప్రభుత్వ పెద్దల హస్తం ఏమైనా ఉందా.. లేక నేర చరిత్ర కలిగిన వారున్నారా.. అనే విషయాలను తెలుసుకుంటున్నారు. నరసింహరాజు కాల్ డేటా, ఇతర పూర్తి ఆధారాలు సేకరించిన తరువాత పూర్తి వివరాలను వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు.
సూసైడ్ నోట్‌లో రాసిన శివాజీ, పరంధామయ్య కోసం గాలింపు