
దొంగతనం కేసులో మహిళ అరెస్ట్
కృష్ణలంక(విజయవాడతూర్పు): ఇంట్లో పని మనిషి గా చేస్తూ దుర్భుద్ధితో ఆ ఇంట్లోనే దొంగతనానికి పాల్పడిన నిందితురాలిని కృష్ణలంక పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి సుమారు రూ.45లక్షల విలువైన 625 గ్రాముల బంగారం, 250 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం బస్టాండ్‌లోని పోలీస్ ఔట్‌పోస్ట్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో నిందితురాలిని హాజరుపర్చారు. కేసుకు సంబంధించిన వివరాలను ట్రైనింగ్ డీఎస్పీ పావని, సీఐ నాగరాజుతో కలిసి సౌత్ ఏసీపీ పావన్‌కుమార్ వెల్లడించారు. రాణిగారితోటలోని పాత ఆంజనేయస్వామి గుడి పక్కనే ఉన్న పవన్ సాయి రెసిడెన్సీలో గుంటి సీతామహాలక్ష్మి తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటోంది. గత 18 నెలలుగా వారి ఇంట్లో బాలాజీనగర్‌కు చెందిన కటారి భవాని పని మనిషిగా చేస్తోంది. సీతామహాలక్ష్మి తన కుటుంబ సభ్యులతో కలిసి గత నెల 30వ తేదీ మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి షిరిడికి వెళ్లారు. తిరిగి బుధవారం ఉదయం 6 గంటలకు ఇంటికి చేరుకుని చూసుకోగా ఇంట్లో ఉండాల్సిన బంగారు, వెండి ఆభరణాలు కనిపించలేదు. దొంగతనం జరిగినట్లు నిర్ధారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు ఆదేశాల మేరకు కృష్ణలంక పీఎస్ క్రైమ్ సిబ్బందితో సంఘంటనా స్థలానికి చేరుకొని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని అనుమానితురాలైన భవానీపై పూర్తి నిఘా ఏర్పాటు చేసి ఆమెను అదుపులోనికి తీసుకుని విచారించారు. ఇంటి యజమానులు షిరిడికి వెళ్లడంతో ముందుగానే దొంగిలించిన అదనపు తాళం సహాయంతో యజమాని ఇంట్లోకి వెళ్లి బంగారం, వెండి నగలు దొంగిలించినట్లు ఆమె అంగీకరించింది. ఆమె వద్ద నుంచి సుమారు రూ.45 లక్షల విలువైన 625 గ్రాముల బంగారు, 250 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్టు ఏసీపీ వివరించారు. ఫిర్యాదు అందిన గంట వ్యవధిలోనే చాకచక్యంగా నిందితురాలిని అదుపులోకి తీసుకున్న కృష్ణలంక ఎస్‌ఐ సూర్యనారాయణ, సిబ్బంది ధనలక్ష్మి, సారథినాయక్, ప్రవీణ్‌కుమార్, సాంబయ్య, బాబూరావులను సీపీ రివార్డులతో అభినందించారు.
ఫిర్యాదు అందిన గంట వ్యవధిలోనే నిందితురాలి అరెస్ట్ ఇంటి పనిమనిషే నేరస్తురాలుగా గుర్తింపు నిందితురాలి నుంచి రూ.45 లక్షల విలువైన 625 గ్రాముల బంగారం, 250 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం