ఆర్థిక, లైంగిక నేరాల వేదికవుతున్న ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం | Sakshi
Sakshi News home page

ఆర్థిక, లైంగిక నేరాల వేదికవుతున్న ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం

Published Sun, Feb 11 2024 2:08 AM

- - Sakshi

విజయవాడ : స్మార్ట్‌ ఫోన్‌లో ఎక్కువ మంది వినియోగించే ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం, ఎక్స్‌ వంటి సోషల్‌ మీడియా వేదికగా సైబర్‌ కీచకులు రెచ్చిపోతున్నారు. ఆర్థిక, లైంగిక నేరాలకు తెగబడుతున్నారు. ఈ యాప్‌లను వినియోగిస్తున్న వారి మానసిక స్థితి ఆధారంగానే హై ప్రొఫైల్‌ నేరాలకు పాల్పడుతున్నారు. యాప్‌లలో రిజిస్ట్రేషన్‌, వినియోగం, సమాజ పోకడలపై అవగాహన లేని వ్యక్తులే సైబర్‌ కీచకుల వలలో చిక్కి మోసపోతున్నారని పోలీసులు పేర్కొంటున్నారు.

ఎలా చేస్తారంటే..
నేరగాళ్లు ముందుగా ఆయా యాప్‌ల సెర్చ్‌ బాక్స్‌ల్లో రాండమ్‌గా కొన్ని పేర్లను వెదుకుతారు. ఆయా పేర్లతో ఉన్న యాప్‌ల అకౌంట్లలో ఎంత మంది ఫ్రెండ్స్‌, ఫాలోవర్స్‌ ఉన్నారు, ఏఏ తరహా వీడియోలు/ఫొటోలను షేర్‌ చేస్తున్నారు వంటి అంశాలను క్షుణ్ణంగా గమనిస్తారు. ఆ తరువాత వారి ఫ్రెండ్స్‌ లిస్ట్‌లోని ఒకరిని ఎంచుకుంటారు. ఆ వ్యక్తి ఫ్రెండ్‌ లిస్ట్‌లోని ఒకరి ఫొటోతో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపి స్తారు. ఫ్రెండ్‌కి ఫ్రెండే కదా అని రిక్వెస్ట్‌ అంగీకరించి లిస్ట్‌లో చేర్చుకున్న తరువాత తమ పని మొదలు పెడతారు. తియ్యల పదాలతో చాటింగ్‌ చేస్తూ దగ్గరవుతారు. చాటింగ్‌లోనే ఫోన్‌ నంబర్‌ సహా వ్యక్తిగత వివరాలన్నీ సేకరిస్తారు. అక్కడ నుంచి ఫోన్‌లో తరుచూ మాట్లాడటం, ఆ తరువాత వీడియో కాల్‌తో ముగ్గులోకి దించి బ్లాక్‌మెయిల్‌కు తెగబడతారు. పలువురు మహిళలు ఇలా కీచకుల వలలో చిక్కుకుని లైంగిక వేధింపులకు గురైన ఘటనలు ఉన్నాయని పోలీసులు పేర్కొంటున్నారు. మూడేళ్ల క్రితం వరకు రాజస్థాన్‌ రాష్ట్రంలోని భరత్‌పూర్‌ కేంద్రంగా ఈ తరహా నేరాలు జరిగేవి. తాజాగా హైదరాబాద్‌, బెంగళూరు కేంద్రాలుగా సైబర్‌ కీచకులు నేరాలకు తెగబడుతున్నారని పోలీసులు చెబుతున్నారు.

ఈ జాగ్రత్తలు పాటించాలి..

 •  ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా, ఎక్స్‌ రిజిస్ట్రేషన్‌లో వ్యక్తిగత వివరాలు ఎవరికీ కనిపించకుండా లాక్‌ చేసుకోవాలి.
 •  పాస్‌వర్డ్‌ క్రిటికల్‌గా ఉండేలా జాగ్రత్తపడాలి. యాప్‌ డీపీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
 •  పరిచయం లేని వ్యక్తులతో వ్యక్తిగత వివరాలను పంచుకోకూడదు.
 •  వ్యక్తిగత ఫొటోలు, కుటుంబ సభ్యులతో కూడిన వీడియోలను షేర్‌ చేయకూడదు.
 •  ఆగంతకుల ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లను ఆమోదించకూడదు. వారిచ్చే గిఫ్ట్‌లు స్వీకరించకూడదు.
 •  అవసరం లేనప్పుడు ఇంటర్‌నెట్‌ డేటా, వై ఫైను ఆఫ్‌ చేయాలి.
 •  వ్యక్తిగత సమయాల్లో దగ్గర్లోని ఫోన్‌, ల్యాప్‌టాప్‌ల కెమెరాలను ఏదైనా వస్త్రంతో లేదా కవర్‌తో కప్పేయాలి.
 •  అవసరం లేని యాప్‌లను ఫోన్‌ నుంచి డిలీట్‌ చెయ్యాలి.
 •  యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేసే సమయంలో మీడియా, కాంటాక్ట్స్‌కు యాక్సెస్‌ ఇవ్వొద్దు.
 •  వాష్‌రూంనకు మొబైల్‌ను తీసుకెళ్లకూడదు.
 •  పరిచయం ఉన్న/లేని వ్యక్తులు పంపే ప్రతి వెబ్‌ లిక్‌ను క్లిక్‌ చేయకూడదు.

అవగాహనే కీలకం 
సోషల్‌ మీడియాతో ఎంత ఉపయోగం ఉందో, అంతే స్థాయిలో అనర్థాలున్నాయి. సైబర్‌ నేర గాళ్లు సోషల్‌ మీడియాను వేదికగా చేసుకుని రకరకాలుగా నేరాలకు పాల్పడుతున్నారు. పోలీస్‌ కమిషనర్‌ టి.కె.రాణా ఆదేశాలతో ఈ నేరాలపై నిత్యం ఏదో ఒక విద్యాసంస్థ లేదా ప్రధాన కూడళ్ల వద్ద విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. ఎలాంటి సైబర్‌ నేరం బారిన పడినా వెంటనే 1930 టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేయాలి. సైబర్‌ నేరాలపై అవగాహన పెంచుకోవాలి. లైక్‌లు, షేర్‌ల మోజులో పడి ఆగంతకుల చెరలో చిక్కొద్దు.
– కోమాకుల శివాజీ, సీఐ, సైబర్‌ పోలీస్‌ స్టేషన్‌

Advertisement
 

తప్పక చదవండి

Advertisement