అమెరికా వృద్ధిలో భారతీయుల వాటా ఎంత? | Sakshi
Sakshi News home page

అమెరికా వృద్ధిలో భారతీయుల వాటా ఎంత?

Published Thu, Apr 25 2024 5:19 PM

What is the share of Indians in US growth? - Sakshi

అమెరికాలో నివసిస్తున్న మన భారతీయుల్లో 65,960 మందికి అగ్రరాజ్య పౌరసత్వం అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. అనేకమంది మనవారు అక్కడ ఎప్పటి నుంచో నివసిస్తున్నా అందరికీ అక్కడి పౌరసత్వం లేదు. మనదేశంలో పుట్టి అక్కడ జీవిస్తున్నవారిలో దాదాపు 42 శాతం మందికి అక్కడి పౌరసత్వం పొందే అర్హత లేదని సీ ఆర్ ఎస్ నివేదిక తెలుపుతోంది.2023 నాటికి గ్రీన్ కార్డ్ లేదా లీగల్ పర్మినెంట్ రెసిడెన్సీ వున్న 2,90,000 మంది భారతీయులకు సహజ విధానంలో పౌరసత్వం పొందే అవకాశం వుందని చెబుతున్నారు.

అమెరికాలో నివసిస్తున్న విదేశీయులు ఆ దేశ జనాభాలో 14శాతం. గతంతో పోల్చుకుంటే అమెరికాలో నివసించే భారతీయుల సంఖ్య గణనీయంగా పెరిగింది.సాఫ్ట్ వేర్ రంగం పెరుగుతున్న కొద్దీ  మనవాళ్ళ సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. విద్యార్థులు కూడా పెరుగుతున్నారు. తెలుగువారు కూడా బాగా పెరుగుతున్నారు.1.35 శాతంతో దాదాపు 50లక్షల మందికి పైగా మనవారు అగ్రరాజ్యంలో నివసిస్తున్నారు. కొత్తగా 65,960 మంది అధికారిక అమెరికా పౌరులయ్యారు. అగ్రరాజ్య పౌరసత్వం పొందాల్సిన మనవాళ్ళు ఇంకా చాలామంది వున్నారు.

17 వ శతాబ్దం నుంచే మనవాళ్ళు అమెరికాకు వెళ్తున్నారు, కొందరు అక్కడే జీవిస్తున్నారు.వాళ్ళ అవసరాల కోసం మనవారిని వాళ్ళ సేవకులుగా తీసుకెళ్లడం అప్పటి నుంచే ప్రారంభమైంది."వాళ్లు సేవకులు కాదు బానిసలు" అని మన చరిత్రకారులు అంటున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వారు మనవారిని వాళ్ళ కాలనీలకు తరలించుకొని తీసుకెళ్లారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇది మరో రూపం తీసుకుంది. కొంతమంది ఉపాధి కోసం, కొంతమంది విద్య కోసం అమెరికా బాట పట్టారు. ఈ నాలుగు దశాబ్దాలలో ఆ సంఖ్య క్రమంగా గణనీయంగా పెరిగింది.

1900 ప్రాంతంలో సిక్కులు ఎక్కువగా కాలిఫోర్నియా ప్రాంతంలో ఉన్నట్లు తెలుస్తోంది. స్వామి వివేకానంద చికాగో ప్రయాణం, ఉపన్యాసం పెద్ద ప్రభావాన్ని చూపించింది. వేదాంత సొసైటీ స్థాపనకు దారితీసింది. సిక్కులను కూడా అమెరికాలో ఒకప్పుడు హిందువులనే పిలిచేవారు. ఒక దశలో,భారతదేశం నుంచి వలసలను అరికట్టాలని కూడా అమెరికా చూసింది. ఇమిగ్రేషన్ చట్టాన్ని మరింత బలంగా నిర్మాణం చేయడంతో మన వాళ్ళ అమెరికా వలసలు తగ్గిపోయాయి. 1920ప్రాంతంలో భారతీయ అమెరికన్ల జనాభా కేవలం 6,400. ప్రస్తుతం 50లక్షలు. ఈ వందేళ్లలో  మనవాళ్ళ జనాభా ఎన్నిరెట్లు పెరిగిందో? దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.

మన జనాభా పెరగడానికి కారణాలలో విద్య ప్రధానమైంది. దానికి మూలం మన ప్రతిభ. 1920ల్లో మన ప్రతిభ చూపించి వాళ్ళను గెలిచినవారిలో మన యల్లాప్రగడ సుబ్బారావు పేరెన్నిక కన్నవారు. గోవింద్ బిహారీ లాల్ కూడా చాలా గొప్పవారు. జర్నలిజంలో ప్రతిష్ఠాత్మకమైన పులిట్జర్ పురస్కారాన్ని పొందిన తొలి భారతీయుడు. అక్కడి నుంచి మొదలైన మన భారతీయ ప్రతిభా ప్రయాణం నేడు ఐటీ దిగ్గజాలు సత్య నాదెండ్ల, సుందర పిచ్చయ్య వంటివారు వరకూ సాగింది. మన దేశ మూలాలు కలిగిన కమలా హ్యారిస్ ప్రస్తుతం అగ్రరాజ్య ఉపాధ్యాక్షురాలుగా పదవిని అలంకరించారు. బానిసల గతి నుంచి బాసుల స్థాయికి మన భారతీయులు ఎదగడం గర్వకారణం.వ్యాపార, వాణిజ్యాలలో మనవారు అక్కడ అద్భుతంగా రాణిస్తున్నారు.

మానవవనరులలో మనది గౌరవనీయమైన స్థానం. వైట్ హౌస్ లోనూ మనవారి ప్రాతినిధ్యం పెరుగుతోంది. అమెరికా ఎన్నికల్లో ఆర్ధిక సహాయం అందించేవారిలో మనవాళ్ళు కీలకంగా వున్నారు. కాకపోతే, రాజకీయ భాగస్వామ్యంలో మాత్రం వెనుకబడి వున్నారు. అమెరికాలో ఓటు హక్కున్న మనవాళ్ళు చాలామంది అస్సలు ఓటే వెయ్యరని మన వాళ్లే అంటారు. ఇది ఏ మాత్రం ఆహ్వానించదగిన విషయం కాదు. ఎన్నికల్లో నిలుచుండే అభ్యర్థులకు డబ్బులిస్తే సరిపోదు. ఎన్నికల్లో నిలబడాలి, ముఖ్యంగా ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలి.సాఫ్ట్ వేర్ రంగం తాజాది. వైద్యం, విద్య, పరిశోధన, మార్కెటింగ్ విభాగాల్లోనూ మనవాళ్ళు గౌరవనీయమైన సంఖ్యలోనే వున్నారు.

అంతర్జాతీయ సంబంధాలలో అమెరికా ఒకప్పుడు పాకిస్తాన్ కే ఎక్కువ మద్దతు చూపించేది. పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా అధికారం పీఠం ఎక్కిన తర్వాత మన విదేశాంగ విధానంలో కొత్త వ్యూహాలు అల్లడం మొదలుపెట్టారు.  అందులో అమెరికా బంధాలు కీలకమైనవి. చైనాతో ఎప్పటికైనా ఇబ్బందులు వస్తాయని ఆయన ముందే గ్రహించి ఈ అడుగు వేశారు. మన్ మోహన్ సింగ్ అదే బాటలో నడిచారు. నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయ్యాక సరికొత్త రూపును తెచ్చారు. ముఖ్యంగా డోనాల్డ్ ట్రంప్ తో వ్యక్తిగత స్నేహాన్ని నెరిపారు. ట్రంప్ ఎన్నికలకు అమెరికా వెళ్లి ప్రచారం చేసి వచ్చారు. ట్రంప్ ను ఇండియా ఆహ్వానించి గుజరాత్ లో లక్షమందితో పెద్ద సభ ఏర్పాటు చేసి, ట్రంప్ ను తన్మయంలో మునకలు వేయించారు.

అమెరికాలో ప్రధానంగా వున్న రాజకీయ పార్టీలు రెండు. ఒకటి డెమోక్రటిక్ పార్టీ , రెండోది రిపబ్లికన్ పార్టీ. మనవాళ్ళు మొదటి నుంచి ఎక్కువ శాతం సహజంగా డెమోక్రటిక్ పార్టీకి మద్దతు అందించారు. క్రమంగా రిపబ్లికన్ పార్టీ వైపు కూడా మొగ్గు చూపడం ప్రారంభించారు. ముఖ్యంగా డోనాల్డ్ ట్రంప్ సమయంలో ఈ పరిణామం జరిగిందని అంటారు. బిల్ క్లింటన్, బరాక్ ఒబామా నుంచి జో బైడెన్ వరకూ అమెరికా అధ్యక్షులుగా పనిచేసినవారు భారతదేశం పట్ల ప్రత్యేక ప్రేమ చూపించి నట్లు కనిపించినా, వారి ప్రేమ ఒకింత పాకిస్తాన్ వైపే ఎక్కువగా ఉండేదని కొందరు వ్యాఖ్యానిస్తారు. వీరితో పోల్చుకుంటే డోనాల్డ్ ట్రంప్ కు భారత్ పట్ల ఆకర్షణ, అనురాగం ఎక్కువని కొందరు అంటారు.

రేపు జరగబోయే ఎన్నికల్లో  ట్రంప్ - బైడెన్ మధ్య హోరాహోరి పోరు వుంది. ట్రంప్ అధికారంలోకి వస్తే భారత్ కు, అక్కడ నివసించే భారతీయులకు ఎక్కువ మేలు జరుగుతుందని ఒక వర్గం అంటోంది. మనది ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్. మనతో అగ్రరాజ్యానికి చాలా అవసరం వుంది. గతంతో పోల్చుకుంటే మన అవసరం ఆ దేశానికి పెరుగుతోంది. అమెరికా - భారత్ మధ్య వాణిజ్య, వ్యాపారాలు పెరుగుతున్నాయి. ఇంకా పెరగాల్సి వుంది. పెట్టుబడులు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, అక్కడ నివసించే మన వారికి పన్నుల రాయతీలోనూ, వ్యాపార ప్రోత్సాహకాలలోనూ, పౌరసత్వ కల్పనలోనూ, రాజకీయ భాగస్వామ్యంలోనూ ఇంకా సహకారం ఎంతో పెరగాల్సి వుంది. ఇమిగ్రేషన్, వీసాల అనుమతులు, ఉద్యోగాల కల్పనలో అగ్రరాజ్యం ఇంకా ఉదారంగా వ్యవహరించాలి.

ప్రస్తుతం,అమెరికాలో కీలక భూమిక పోషిస్తున్న భారతీయులు భవిష్యత్తులో మరింత కీలకమైన వ్యక్తులుగా, వ్యవస్థలుగా మారతారని నిస్సందేహంగా చెప్పవచ్చు. అగ్రరాజ్యంలో  భారతీయుల అధికారిక అమెరికా పౌరుల సంఖ్య భవిష్యత్తులో గణనీయంగా పెరుగుతుందని  అంచనా వెయ్యవచ్చు.ఇప్పటికే పౌరసత్వం వున్న కొందరికి సంపూర్ణమైన స్వేచ్ఛ లేదు.దానికి కూడా పరిష్కారం లభించాలి. ఉభయ పౌరసత్వం ( అమెరికా - భారత్ ) పట్ల కూడా అడుగులు పడవచ్చు.

- మాశర్మ. సీనియర్‌ జర్నలిస్టు

Advertisement
Advertisement