
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA).. అనిర్వచనీయమైన వేడుక నిర్వహించింది. ఫీనిక్స్, అరిజోనాలోని మెసా కన్వెన్షన్ సెంటర్‌లో వైభవోపేతమైన కార్యక్రమం ‘ఆటా డే’ (ATA DAY -2025)ను చేపట్టి నాలుగువేల మందికి పైగా ఆహుతులను మధురానుభూతుల్లో నింపింది. ఆటా (ATA) సంప్రదాయ కార్యక్రమం.. ఏడుకొండలవాడైన శ్రీనివాసుడి కల్యాణంతో ఈ ఉత్సవాన్ని ప్రారంభించింది.
అందరి శ్రేయస్సు కోరుతూ నిర్వహించిన ఈ కమ్మని వేడుకలో భాగస్వాములవడం తమకు దక్కిన మహాభాగ్యమని హాజరైన తెలుగువారందరూ మురిసిపోయారు. ఎంతో రుచికరమైన.. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తీసుకువచ్చిన లడ్డూ ప్రసాదాన్ని కన్నులకద్దుకుని స్వీకరించి భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమం కనువిందు చేసింది. రోజంతా జరిగిన కార్యక్రమాలతో మెసా కన్వెన్షన్ సెంటర్ కళకళలాడింది. ఫ్యాషన్ షో, పిల్లల పోటీలు, ఫుడ్ ఫెస్టివల్ ఒక గొప్ప మెమొరీగా నిలిచాయి. హాయిగొలిపే సాయంత్రం వేళ... గాయని సుమంగళి అండ్ రాగిన్ బ్యాండ్ లైవ్‌కాన్సర్ట్‌తో అందరినీ హుషారెత్తించారు. ఉర్రూతలూగించే పాటలతో ప్రతి ఒక్కరినీ కుర్చీలోంచి లేపి డ్యాన్స్ చేయించారు.
ఔత్సాహికులకు మార్గదర్శిగా బిజినెస్ ఫోరం
స్వామి వారి కల్యాణానంతరం బిజినెస్ ఫోరమ్ (Business Forum) సమావేశం నిర్వహించారు. తమతమ వ్యాపారాల్లో తమదైన మార్క్ చూపిన వ్యాపారులు తమ అనుభవాలను, అనుసరించిన మార్గాలను ఔత్సాహిక వ్యాపారవేత్తలకు వివరించి ప్రోత్సహించారు. ఆటా నేషనల్ టీమ్ అధ్యక్షుడు జయంత్ చల్లా, మాధవీరెడ్డి, కిరణ్ వేదాంతం, బాల పట్తెం, మధు రాయపాటి ఈ ఫోరంలో తమ అమూల్య సందేశమిచ్చారు. మొత్తమ్మీద ఈ కార్యక్రమం నూతన వ్యాపారవేత్తలకు ఒక మార్గదర్శకంగా నిలిచిందని చెప్పవచ్చు.
ప్రశంసించిన చాండ్లర్ మేయర్ కెవిన్ హార్ట్‌కీ
చాండ్లర్ (ఫీనిక్స్) మేయర్ కెవిన్ హార్ట్‌కీ ఈ వేడుకకు హాజరై తెలుగు కమ్యూనిటీ సేవలను ప్రశంసించారు. ఆటా నేషనల్ టీమ్ అధ్యక్షుడు జయంత్ చల్లా, ప్రెసిడెంట్ ఎలెక్ట్ సతీష్‌రెడ్డి, కార్యదర్శి సాయినాథ్ బోయపల్లి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నర్సిరెడ్డి గడ్డికోపుల, ట్రస్టీ వెన్నరెడ్డి హాజరై ఫీనిక్స్ టీమ్‌కు అభినందనలు తెలిపారు.
ఆటా ప్రాంతీయ డైరెక్టర్ రఘునాథ్ గాడి, కోఆర్డినేటర్లు సునీల్ అన్నపురెడ్డి, శుభ గాయం, మదన బొల్లారెడ్డి, స్పోర్ట్స్ చైర్ శేషిరెడ్డి గాడి, మహిళా విభాగం బింద్యా, కో చైర్ దివ్య తలసిల, కల్చరల్ చైర్ కాంతిప్రియ, సహచరులు నివేదిత గాడి, ప్రధాన సభ్యులు పరితోష్ పోలి, శివ దేవగుడి, రవి గర్లపాటి, అరవింద్, ప్రణయ్, ప్రవీణ్, దీరజ్ పోలా, రుకుమైలా, మాలతి గర్లపాటి, విజయ్ కందుకూరి, సారితా బండారు, సుదర్శన్ ఈ ఈవెంట్‌ను గొప్పగా నిర్వహించడానికి విశేషంగా కృషి చేశారు.
డిసెంబర్ 12 నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఆటా(ATA) సేవా కార్యక్రమాలు
ఆటా(ATA) నేషనల్ టీమ్ అధ్యక్షుడు జయంత్ చల్లా.. గత కొన్నినెలలుగా అమెరికాలోని 25 నగరాల్లో నిర్వహించిన కార్యక్రమాలను వివరించారు. రాబోయే 19వ ఆటా కన్వెన్షన్ (ATA Convention)ను వచ్చే ఏడాది(2026) జూలై 31, ఆగస్టు1, 2 తేదీల్లో బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించనున్నట్టు సభికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ప్రెసిడెంట్ ఎలెక్ట్ సతీష్‌రెడ్డి.. అమెరికాలో, భారత్ లో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను ప్రస్తావించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ ఏడాది (2025) డిసెంబర్ 12 నుంచి 27 వరకు ఆటా సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వివరించారు. డిసెంబర్ 27న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో గ్రాండ్ ఫినాలే (grand finale) ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.