
లండన్: ప్రఖ్యాత సహస్రావధాని, పద్మశ్రీ పురస్కార గ్రహీత గరికపాటి నరసింహారావు తన తొలి యూకే పర్యటనలో భాగంగా బ్రిటిష్ ఇండియన్ తెలుగు సంస్కృతి సంఘం ఆహ్వానంపై పలు నగరాల్లో ప్రవచనాలు నిర్వహించారు. ఈ పర్యటనలో ఆయన జీవిత శిక్షకుడిగా, సాహిత్య పండితుడిగా తన మేధస్సుతో వేలాది మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
బర్మింగ్‌హామ్ నగరంలో జరిగిన కార్యక్రమంలో గరికపాటి నైతిక, ధార్మిక విలువలపై ప్రసంగించారు. లండన్‌లో జరిగిన ప్రవచనం ప్రధానంగా ధర్మబద్ధమైన జీవనం, జాతి నిర్మాణంలో NRIల పాత్ర అనే అంశాల చుట్టూ సాగింది. ఆయన ప్రసంగంలో హాస్యం, భక్తి, తత్వశాస్త్రం మేళవించి, శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. ప్రసంగంలో గరికపాటి గారు AI వాడకంపై చమత్కారమైన హెచ్చరికలు చేస్తూ, తగిన నియంత్రణ లేకపోతే దాని ప్రమాదాలు గురించి పునరుద్ఘాటించారు. అంతేకాక, ప్రతి NRI తన స్వగ్రామాన్ని దత్తత తీసుకుని దేశానికి సేవ చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా బిట్సెస్ బృందాన్ని సురేష్ మంగళగిరి పరిచయం చేశారు. కాటెపల్లి సచిందర్ రెడ్డి, వాసా బరత్, యశ్వంత్, రాగసుధ, షణ్ముఖ్, సుభాష్, అశ్విన్, సుదర్శన్, రాజ్ దేవరపు, శరత్ తమా, వివేక్, శ్రీనివాస్, బాలు తదితరులు కోర్ కమిటీ సభ్యులుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. వాలంటీర్లు, స్పాన్సర్లు అందించిన మద్దతుతో ఈ పర్యటన తెలుగు సంస్కృతికి, ధర్మబద్ధమైన జీవన దృక్పథానికి అద్భుత వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమాల్లో భజనలు, శాస్త్రీయ నృత్యాలు కూడా ప్రదర్శించబడ్డాయి. ఇది ఎన్‌ఆర్‌ఐలు తమ కళా, సాంస్కృతిక విలువలను ఎలా నిలబెట్టుకుంటున్నారనే దానికి నిదర్శనంగా నిలిచింది.