శక్కర్‌నగర్‌ బడికి కొత్త శోభ | - | Sakshi
Sakshi News home page

శక్కర్‌నగర్‌ బడికి కొత్త శోభ

Oct 5 2026 12:57 AM | Updated on Oct 5 2026 12:57 AM

తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో..

● ఉపాధ్యాయుల సమష్టి కృషితో

సత్ఫలితాలు..

● ప్రైవేట్‌ నుంచి భారీగా చేరికలు

బోధన్‌: పట్టణంలోని శక్కర్‌నగర్‌ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల సమష్టి కృషితో రూపురేఖలు మార్చుకుంటోంది. నాణమైన విద్యను అందించడంతో పాటు విద్యార్థినులకు ఆహ్లాదకరమైన అభ్యాస వాతావరణాన్ని కల్పించేందుకు పాఠశాల ఆవరణను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. గోడలపై పాఠ్యాంశాలకు సంబంధించిన చిత్రాలు, ప్రకృతి పర్యావరణం, సైన్స్‌, స్పోర్ట్స్‌ అంశాలను ప్రతిబింబించే బొమ్మలను వేయించి విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నారు.

పాఠశాల అభివృద్ధికి..

దశాబ్దాల క్రితం ఏర్పాటైన ఈ పాఠశాలలో హెచ్‌ఎం హన్నాగ్రేస్‌ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఉపాధ్యాయులతో సమన్వయం చేసుకుంటూ అభి వృద్ధికి చర్యలు చేపట్టారు. పాఠశాలలోని మార్పులను గమనించిన తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం తెలుగు, ఇంగ్లిష్‌, ఉర్దూ మీడియంలో 6 నుంచి 10వ తరగతి వరకు 238 మంది విద్యార్థినులు చదువుతున్నారు. ఈ విద్యాసంవత్సరంలో కొత్తగా చేరిన వారిలో సుమారు 90 మంది ప్రైవేట్‌ పాఠశాలల నుంచి రావడం విశేషం.

డిజిటల్‌ బోధన..

పాఠశాలలో 8 నుంచి 10వ తరగతి వరకు డిజిటల్‌ విధానంలో పాఠాలు బోధిస్తున్నారు. సైన్స్‌ ల్యాబ్స్‌, లైబ్రరీని ఏర్పాటు చేసి ప్రయోగాల ద్వారా విద్యార్థులకు పాఠ్యాంశాలను సులభంగా అర్థమయ్యేలా చేస్తున్నారు. చదువుతో పాటు వివిధ క్రీడల్లోనూ విద్యార్థినులకు శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థినులు వరుసగా రెండు, మూడు రోజులు పాఠశాలకు గైర్హాజరైతే ఉపాధ్యాయులు వారి ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడుతున్నారు. దీంతో హాజరు శాతం మెరుగుపెరుగుతోంది. గతేడాది పదో తరగతి ఫలితాల్లో పాఠశాల 86.3 శాతం ఉత్తీర్ణత సాధించింది. ఇంగ్లిష్‌ మీడియంలో వందశాతం ఉత్తీర్ణత నమోదు కావడం పాఠశాల బోధనా ప్రమాణాలకు నిదర్శనంగా నిలిచింది.

సొంత నిధులతో..

పాఠశాలలో మౌలిక వసతుల కోసం ఉపాధ్యాయులే సొంతంగా విరాళాలు సమకూర్చి సుమారు రూ. 70వేలతో మరుగుదొడ్ల మరమ్మతులు చేయించారు. మరో 30 వేలతో తరగతి గది మరమ్మతులు చేపట్టారు. పాఠశాల ఆవరణను పచ్చదనంతో తీర్చిదిద్ది విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించారు. హెచ్‌ఎం హన్నాగ్రేస్‌ పర్యవేక్షణలో 16 మంది ఉపాధ్యాయులు విద్యార్థినులకు విద్యాబోధన చేస్తున్నారు.

ప్రార్థనలో పాల్గొన్న విద్యార్థినులు

విద్యార్థినుల తల్లిదండ్రులు, ఉ పాధ్యాయుల సంపూర్ణ సహకారం, ప్రభుత్వ ప్రోత్సాహంతో పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. బడిబాట కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి తమ పాఠశాలలో అందిస్తున్న విద్యా బోధన తీరు, కల్పించబడిన సౌకర్యాలు వివరించాం. ఈ ఏడాది విద్యార్థి నుల సంఖ్య పెరిగింది. ప్రతి విద్యార్థినుల చదువు పురోగతి పై నిత్యం ఉపాధ్యాయులు పర్యవేక్షిస్తున్నారు.

– హన్నాగ్రేస్‌, హెచ్‌ఎం,

ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement