ఎస్‌ఐఆర్‌ను పారదర్శకంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐఆర్‌ను పారదర్శకంగా నిర్వహించాలి

May 31 2026 4:41 AM | Updated on May 31 2026 4:41 AM

బీఎల్‌వోలు ఇంటింటిని సందర్శించి సమగ్ర పరిశీలన జరపాలి

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి

సుదర్శన్‌ రెడ్డి

నిజామాబాద్‌అర్బన్‌: స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్‌రెడ్డి సూచించారు. ఎస్‌ఐఆర్‌ అమలు తీరు పై శిక్షణ, ఓటరు మ్యాపింగ్‌ పురోగతిని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఈవో శుక్రవారం తెలుసుకు న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1950 నుంచి ఇప్పటి వరకు దాదాపు పదిసార్లు ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఎస్‌ఐఆర్‌ ద్వారా శాశ్వతంగా వలస వెళ్లిన, మరణించిన, డబుల్‌/డూప్లికేట్‌ ఎంట్రీల తొలగింపు జరుగుతుందని వివరించారు. ఈ ఏడాది అక్టోబర్‌ 1వ తేదీనాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించనున్నట్లు తెలిపారు. జూన్‌ 25 నుంచి జూలై 24 వరకు బూత్‌ లెవల్‌ అధికారులు ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను పూర్తిస్థాయిలో ధ్రువీకరించాలని ఆదేశించారు. భారత పౌరసత్వ నిబంధనల ప్రకారం అవసరమైన పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని, 1 జులై 1987కు ముందు జన్మించిన వారు తమ స్వీయగుర్తింపు లేదా జనన ఆధార పత్రాలు సమర్పిస్తే సరిపోతుందని, తల్లిదండ్రుల పత్రాలు అవసరం లేదన్నారు. 1 జులై 1987 నుంచి 2 డిసెంబర్‌ 2004 మధ్య జన్మించిన వారు తమ పత్రాలతోపాటు తల్లి లేదా తండ్రికి సంబంధించి ధ్రువపత్రం సమర్పించాలని, అలాగే 2 డిసెంబర్‌ 2004 తర్వాత జన్మించిన వారు తల్లిదండ్రులిద్దరి ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంటుందన్నారు. కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్‌ భుజంగరావు, ఆర్మూర్‌ సబ్‌ కలెక్టర్‌ అభిగ్యాన్‌ మాల్వియా, నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ దిలీప్‌కుమార్‌, నిజామాబాద్‌, బాన్సువాడ, బోధన్‌ ఆర్డీవోలు రాజేంద్రకుమార్‌, రవీందర్‌రెడ్డి, విజయ, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, ఏఈఆర్‌వోలు పాల్గొన్నారు.

ఏజెంట్ల నియామకంలో జాప్యం వద్దు

బూత్‌ లెవెల్‌ ఏజెంట్ల నియామకాన్ని రాజకీ య పార్టీలు జాప్యం చేయొద్దని, జాబితాను నిర్ణీత ఫార్మాట్‌లో వెంటనే అందించాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి సూచించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ అమలులో బీఎల్‌ఏల పాత్ర కీలకమని, కేవలం ఒక పార్టీ మాత్రమే రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన బీఎల్‌ఏల వివరాలు సమర్పించిందని తెలిపారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలతో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ అమలు ప్రక్రియపై కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. కోసం ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా ఎస్‌ఐఆర్‌ ను అమలు చేస్తోందని, ఈ ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి చేసేలా పర్యవేక్షణ జరపాలని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement