రుద్రూర్ : మండలంలోని అక్బర్‌నగర్ శివారులో ఉన్న వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను జగిత్యాల జిల్లా పొలాస కళాశాలలో విలీనం చేయాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అఖిలపక్షం నా యకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కళాశాల ఎదుట ధర్నా నిర్వహించి అధికారులకు వినతిపత్రం అందజేశారు. పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు గౌతంకుమార్ మాట్లాడుతూ.. వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను జగిత్యాల పొలాస కళాశాలలో విలీనం చేస్తున్నట్లు యూనివర్సిటీ అధికారులు ప్రొసిడింగ్స్ జారీ చేయడం బాధాకరమని, జిల్లా విద్యార్థులకు అన్యాయం చేసే చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్, తరగతి గదులు, ప్రాక్టికల్స్‌కు అవసరమైన వ్యవసాయ భూమి, శాస్త్రవేత్తలు, అధ్యాపకులు తదితర అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ కళాశాలను తరలించేందుకు ప్రయత్నించడం సరికాదన్నారు. వి ద్యాభివృద్ధి చేస్తామని చెప్పిన ప్రభుత్వం ప్రస్తు తం ఉన్న కళాశాలలను మూసివేసి సాంకేతిక విద్యను విద్యార్థులకు దూరం చేస్తోందని విమర్శించారు. అక్బర్‌నగర్ సర్పంచ్ సీతారామరాజు, ఉపసర్పంచ్ హబీబ్ ఖాన్, అంబం సర్పంచ్ గంగాధర్, జహీరాబాద్ పార్లమెంట్ దిశా కమిటీ సభ్యుడు నడిపింటి నగేశ్, పీడీఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షుడు కార్తీక్, ఏఎంసీ మాజీ చైర్మన్ బి సంజీవులు, మాజీ సర్పంచ్ రామాగౌడ్, మాజీ ఉపసర్పంచ్ నీరడి శంకర్, బీఎస్పీ మండల అధ్యక్షుడు గౌతమ్, బీజేపీ నాయకులు కృష్ణంరాజు, చిన్న సాయిలు, బీఆర్‌ఎస్ నాయకుడు ఎండీ మతీన్, నాయకులు, విద్యార్థి సంఘాల సభ్యులు పాల్గొన్నారు.


