డిచ్‌పల్లి : ఏడేళ్లు నిజామాబాద్ ఎంపీగా, 12 ఏళ్ల కేంద్ర ప్రభుత్వ బీజేపీ పాలనలో జిల్లాకు గాడిద గుడ్డు కూడా ఇవ్వలేదని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి మండిపడ్డారు. ఎంపీ అర్వింద్ చిల్లర రాజకీయాలకు పాల్పడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై వ్యాఖ్యలు చేస్తున్నారని ఖండించారు. ఈ మేరకు సోమ వారం ఆయన ‘సాక్షి’తో మా ట్లాడారు. జిల్లాకు రింగ్ రోడ్ అనేది ఎన్నికల హామీ కాద ని.. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా జిల్లాకు వచ్చిన సందర్భంలో ఇక్కడి పార్టీ నాయకులు విన్నవిస్తే.. తప్పకుండా రింగ్ రోడ్ ఇస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు గుర్తుచేశారు. త్వరలోనే జిల్లాకు రింగ్ రోడ్ రావడం ఖాయమన్నారు. దానిని వక్రీకరించి బీజేపీ దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తోందన్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్ పదవి ఊడితే దానిని పొందడానికి ఎంపీ అర్వింద్.. ప్రధాని మోడీని ఇంప్రెస్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. కరీంనగర్ విస్తీర్ణంలో నిజామాబాద్ కన్నా చిన్నదైనప్పటికీ స్మార్ట్ సిటీ అయ్యిందని, మరి జిల్లా ఎందుకు కాలే దో ఎంపీ చెప్పాలని ప్రశ్నించారు. జిల్లాకు తెచ్చిన పసుపు బోర్డు ఇప్పటికీ సొంత భవనానికి నోచుకోలేదన్నారు. బీసీ బిడ్డకు అధ్యక్ష పదవి ఇస్తే బీజేపీ ఓర్వలేకే అనుచిత వ్యాఖ్యలకు పాల్పడుతోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాకు ఇంజినీరింగ్ కళాశాల, వ్యవసాయ కళాశాల, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మంజూరు చేసినట్లు వెల్లడించారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో దాదాపు రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.


