అనుమానాస్పదస్థితిలో ఒకరి మృతి
కామారెడ్డి రూరల్: మండలంలోని రాఘవపూర్ శివారులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. రాఘవపూర్ శివారులో వ్యక్తి మృతదేహం ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి కుడి చేతిపై వీ చరణ్ అని పచ్చబొట్టుతో రాసి ఉందన్నారు. మృతుడి ఒంటి నిండా రక్తం ఉండడంతో హత్యకు గురై ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సమాచారం అందించాలని కోరారు.
నిందితుడి రిమాండ్
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డిలో బైక్ చోరీకి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై మహేశ్ శుక్రవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డికి చెందిన నరేశ్‌గౌడ్‌కు చెందిన బైక్‌ను ఈ నెల 2న రాత్రి సమయంలో కామారెడ్డికి చెందిన శౌకత్ అలీ చోరీకి పాల్పడ్డాడు. విచారణలో నిందితుడు నేరం చేసినట్లు రుజువు కావడంతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.
మద్దికుంటలో చోరీ
● మూడున్నర తులాల బంగారం, రూ. లక్ష నగదు అపహరణ
రామారెడ్డి: మండలంలోని మద్దికుంటలో భారీ చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న ఇంట్లోకి దుండగులు ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. ఇందులో మూడున్నర తులాల బంగారం, రూ. లక్ష నగదు, 15 తులాల వెండి అపహరణకు గురైంది. ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓరుగంటి రాజు విద్యుత్‌శాఖలో పనిచేస్తుంటాడు. శుక్రవారం ఉదయం అతను విధులకు వెళ్లిన అనంతరం కుటుంబీకులు ఇంటికి తాళం వేసి కామారెడ్డిలో ఉన్న మైసమ్మ ఆలయానికి వెళ్లారు. వారు సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉండటాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బీరువాలో దాచి ఉంచిన మూడున్నర తులాల బంగారం, రూ. లక్ష నగదు, 15 తులాల వెండిని దుండగులు అపహరించినట్లు బాధితులు తెలిపారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


