తెయూ(డిచ్‌పల్లి): పరిశోధనా ఫలాలు సామాన్యులకు అందినప్పుడే వాటికి సార్థకత లభిస్తుందని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్ యరగర్ల శ్రీనివాసరావు పేర్కొన్నారు. తెలంగాణ యూనివర్సిటీ రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న ‘ఇన్నోవేషన్స్ ఇన్ మెడిసినల్ కెమిస్ట్రీ (ఐఎంసీ–2026)’ జాతీయ సదస్సు గురువారం ముగిసింది. సదస్సుకు ముఖ్యవక్తగా హాజరైన శ్రీనివాసరావు మాట్లాడుతూ సస్టెయినబుల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ సింథసిస్, బయో–యాక్టివ్ మాలిక్యూల్స్ అభివృద్ధిలో ఇమినో కీటోన్స్ ప్రాధాన్యత వహిస్తాయన్నారు. న్యూఢిల్లీ జేఎన్‌యూ ప్రొఫెసర్ డాక్టర్ రాజు చౌహాన్ సహజ ఉత్పత్తుల స్టీరియోసెలెక్టివ్ సింథసిస్ పద్ధతులు, ఫార్మాస్యూటికల్ రంగంలో వాటి ప్రాధాన్యతను వివరించారు. తెయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి మాట్లాడుతూ విద్యార్థులు యువ శాస్త్రవేత్తలుగా ఎదిగి నూతన ఆవిష్కరణలు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కన్వీనర్ సాయిలు, కో–కన్వీనర్ నాగరాజు, ఆర్గనైజింగ్ సెక్రెటరీలు నాగరాజ్, బాలకిషన్, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
బోధన్: హైదరాబాద్‌కు చెందిన వైద్యుల గ్లోబల్ ఫౌండేషన్, వసుంధర విజ్ఞాన వికాస మండలి జాతీయస్థాయి పుర స్కారాలను జిల్లావాసులు అందుకున్నారు. సాలూర గ్రామానికి చెందిన రైతు కేజీ గంగారం పుడమిపుత్ర, పట్టణ కేంద్రానికి చెందిన ప్రముఖ కరాటే మాస్టర్ మల్లెపూల పల్లవి ఝాన్సీ లక్ష్మిబాయి శౌర్యం, చిత్రకారణి అవంతి బాపుచిత్ర కళారత్న పురస్కారాలను గురువారం రవీంద్రభారతిలో నిర్వాహకులు అందజేశారు.
నిజామాబాద్ లీగల్: నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అసోసియేషన్ అధ్యక్షుడిగా నీలకంఠరావు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శికి జరిగిన ఎన్నికల్లో ఆవుల నారాయణ మల్లయ్య, ఎన్.సుభాష్ రెడ్డి విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు అమిడాల సుదర్శన్, మెట్టు నరేశ్ కుమార్ ప్రకటించారు. అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీగా మానస, ట్రెజరర్‌గా మధుసూదన్ గౌడ్, లైబ్రరి సెక్రెటరి పుణ్యరాజ్, స్పోర్ట్స్ అండ్ కల్చరర్ సెక్రెటరీగా గణేష్, లేడి రిప్రజెంటీవ్ ఝాన్సీరాణి, కార్యవర్గసభ్యులుగా దిలీప్, కవిత, రవిబాబు, సుధీర్, అనూష, అపూర్వ, జమీల్ అహ్మద్ జహీర్ అహ్మద్, ఎండీ ఖాలీద్, మహ్మద్ అబ్దుల్ జీషన్ ఎన్నికయ్యారు.


