● ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది
● పంటకు కోతులు, పశువుల బెడద ఉండదు
● కలెక్టర్ ఇలా త్రిపాఠి
నిజామాబాద్ అర్బన్: ఆయిల్‌పామ్ సాగు ఎంతో లాభదాయకమని, రైతులను పంట సాగు దిశగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తోడ్పాటునందిస్తోందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా రైతాంగం సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయిల్‌పామ్‌కు కోతులు, పశువుల బెడద వంటివి ఉండవని, తక్కువ ఖర్చుతో సుదీర్ఘ కాలంపాటు సుమారు దిగుబడి పొందవచ్చని సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెనన్స్ హాలులో గురువారం వ్యవసాయ, ఉద్యానవన, సహకార శాఖల అధికారులు, ఆయిల్ పామ్ నర్సరీని నిర్వహిస్తున్న ప్రీ–యునిక్ కంపెనీ ప్రతినిధులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఆయిల్ పామ్ సాగు పురోగతిపై క్లస్టర్ల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో రైతులను ప్రోత్సహిస్తూ జిల్లాలో ఈ ఏడాది 7 వేల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్‌పామ్ సాగయ్యేలా అంకితభావంతో పని చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆయిల్‌పామ్ సాగు చేపట్టేలా విస్తృత స్థాయిలో అవ గాహన కల్పించాలని, క్షేత్రస్థాయి అధ్యయన యాత్రల ద్వారా వారి లో నమ్మకాన్ని పెంపొందించాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, మద్దతు ధర, సుదీర్ఘ కాలంపాటు ఏటేటా సమకూరే రాబడి, అంతర పంటల సాగుకు ఉన్న అవకాశాలు తదితర అంశాలను వివరించాలన్నారు. జిల్లాలో త్వరలోనే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కానుందని, దీని కోసం అనువైన స్థలాన్ని పరిశీలిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 2022–23 సంవత్సరం నుంచి ఆయిల్ పామ్ సాగుకు శ్రీకారం చుట్టగా, ఇప్పటివరకు 2375 మంది రైతులు 6164 ఎకరాల విస్తీర్ణంలో పంటను సాగు చేస్తున్నారని వివరించారు. సుమారు 1476 ఎకరాలలో ఆయిల్ పామ్ గెలలు కోతకు వచ్చాయని, తద్వారా రైతుల ఖాతాల్లో రూ.2.50 కోట్లు జమయ్యాయని తెలిపారు. అంకాపూర్ లో మార గంగారెడ్డి, కోటగిరి మండలం ఎత్తొండలో ఎం.రమాదేవి, అర్గుల్‌లో మధుసూధన్‌రెడ్డి, కొప్పర్గ గంగారాం తదితరలు ఇప్పటికే ఆయిల్ పామ్ సాగు ద్వారా లాభాలు పొందుతున్నారన్నారు. ఆయిల్ పామ్ సాగుకు సరిపడా మొక్కలు అందుబాటులో ఉన్నాయని, ఒక్కో మొక్క ధర 193 రూపాయలు కాగా.. రైతులు కేవలం రూ.20 లు చెల్లిస్తే, ప్రభుత్వం రూ.173 సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. అలాగే పంట సాగు కోసం నాలుగేళ్లపాటు ఎకరానికి రూ.4,200 చొప్పున ఆర్ధిక తోడ్పాటును, డ్రిప్ ఇరిగేషన్ కోసం ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం, ఇతరులకు 90 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, వ్యవసాయ శాఖ అధికారులు జె.గోవిందు, వీరస్వామి, సహకార అధికారి శ్రీనివాస్ రావు, ప్రీ యునిక్ కంపెనీ ఏరియా మేనేజర్ సాయికిరణ్, ఉద్యానవన, వ్యవసాయ అధికారులు, ఏవోలు, ఏఈవోలు పాల్గొన్నారు.


