కుటుంబ పెద్ద మరణిస్తే రూ.20 వేలు
మోర్తాడ్(బాల్కొండ): జాతీయ కుటుంబ ప్రయోజన పథకం(ఎన్‌ఎఫ్‌బీఎస్)పై రెవెన్యూ శాఖ విస్తృత ప్రచారం చేపట్టింది. కుటుంబంలోని ప్రధాన సంపాదనపరుడు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక ప్రయోజనం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని గతంలోనే ప్రవేశపెట్టింది. అయితే, ఈ పథకం గురించి సరైన ప్రచారం లేకపోవడంతో ఆశించిన స్థాయిలో లబ్ధిదారుల సంఖ్య పెరగలేదు. కేంద్రం అందించే ఎన్‌ఎఫ్‌బీఎస్ కింద లబ్ధి పొందే వారి సంఖ్య పెంచాలనే ఉద్దేశంతో ఇటీవల రెవెన్యూ శాఖ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఎన్‌ఎఫ్‌బీఎస్ ద్వారా ఎక్కువ కుటుంబాలకు లబ్ధి చేకూర్చేందుకు కార్యాచరణ రూపొందించారు. గ్రామ కార్యదర్శులు, పంచాయతీ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది ద్వారా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి తహసీల్ కార్యాలయంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. రెండు, మూడు రోజులకోసారి తహసీల్దార్లు పంచాయతీరాజ్, రెవెన్యూ ఉద్యోగులతో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.
అవసరమైన పత్రాలివే..
మరణించిన వ్యక్తి వయస్సు 18 సంవత్సరాల వయస్సు నిండి 60 ఏళ్ల లోపు ఉండాలి. 2017 తర్వాత మరణించిన కుటుంబ సంపాదనపరుని ఆధార్ కార్డు, డెత్ సర్టిఫికెట్, పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు. అలాగే లబ్ధిదారుని రేషన్‌కార్డు, ఫ్యామిలీ మెంబర్ కార్డు, ఆధార్ కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, బ్యాంకు పాస్‌బుక్ జిరాక్సులను అందజేయాల్సి ఉంటుంది.
ఎన్‌ఎఫ్‌బీఎస్‌పై విస్తృత ప్రచారం
ఇన్నాళ్లూ అవగాహన లేక
లబ్ధి పొందని కుటుంబాలు
లబ్ధిదారుల సంఖ్య పెంచేలా
కార్యాచరణ


