బొట్టు పెడుతూ.. బీడీలు చుడుతూ..
● జిల్లాలో వినూత్నంగా మహిళా
అభ్యర్థుల ఎన్నికల ప్రచారం
ఆర్మూర్: జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి కార్పొరేటర్, కౌన్సిలర్ అభ్యర్థులుగా టికెట్లు సాధించిన మహిళలు తమదైన శైలిలో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. తమ వార్డుల పరిధిలోని కాలనీల్లో ఇంటింటికీ తిరుగుతూ మహిళలకు బొట్టు పెట్టి మరీ తమకు ఓటు వేస్తే తాము చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తున్నారు. మరోవైపు బీడీలు చుడుతున్న మ హిళల వద్దకు వెళ్లి వారితోపాటు బీడీలు చుడుతూ సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. బోధన్ మున్సిపల్ చైర్మన్ స్థానం జనరల్ కాగా, నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్‌తోపాటు ఆర్మూర్, భీమ్‌గల్ మున్సిపాలిటీ చైర్‌పర్సన్ పీఠాలు జనరల్ మహిళలకే రిజర్వు చేయబడ్డాయి. జిల్లాలోని 146 వార్డుల్లో సుమారు 50 శాతం స్థానాలు వివిధ సామాజిక వర్గాలకు చెందిన మహిళలకే రిజర్వు చేశారు. మరో వైపు జనరల్ స్థానాల నుంచి సైతం మహిళలు పోటీ చేస్తున్నారు. అలాగే వీధుల్లో నిర్వహిస్తున్న ప్రచారంలో సైతం వివిధ పార్టీల అభ్యర్థుల వెంట ర్యాలీ గా మహిళలే తరలి వస్తుండటంతో మహిళల ప్రచా రం ప్రత్యేకత సంతరించుకుంది. దీంతో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మహిళల సందడి నెలకొంది.


