మార్కులే చదువుకు కొలమానం కాదు..
నైపుణ్యమే ప్రామాణికం
● విద్యా ప్రమాణాలు పెంచే బాధ్యత ప్రభుత్వాలదే
● మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ్
బోధన్: విద్యార్థులు పరీక్షల్లో సాధించే మార్కులే చదువుకు కొలమానం కాదని, వారిలోని నైపుణ్యమే ప్రామాణికమని లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. ఆదివారం బోధన్ పట్టణంలోని విజయ సాయి హైస్కూల్ నిర్వహించిన గ్రాండ్ పేరెంట్స్ డే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బట్టి పద్ధతిలో కాకుండా చదివిన పాఠ్యాంశాలను అర్థం చేసుకుని భావాన్ని వ్యక్తపర్చాలని, తార్కికంగా ఆలోచించే పద్ధతిని అలవాటు చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వాలు కృషిచేస్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితాలు కనిపించడం లేదని అన్నారు. విద్యార్థులు ఒత్తిడి లేకుండా చదువుకునేందుకు అవకాశం కల్పించాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. తమ పిల్లల భవిష్యత్తు కోసం చేయాల్సిన కర్తవ్యాలను వివరించారు. విద్యార్థులకు తల్లిదండ్రుల త్యాగం, గొప్పతనంపై అవగాహన కల్పించే సంకల్పంతో గత మూడేళ్లుగా గ్రాండ్ పేరెంట్స్ డేను నిర్వహిస్తున్నామని పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణ మోహన్ తెలిపారు. మేనేజర్ ఐఆర్ చక్రవర్తి, ప్రతినిధులు సువర్చల, ప్రసూన, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పట్టణ పలువురు ప్రైవేట్ విద్యా సంస్థల డైరెక్టర్లు, కరస్పాండెంట్లు జయప్రకాశ్ నారాయణ్‌ను కలిసి సన్మానించారు.


