తప్పుడు కేసులతో రూ.30 లక్షలు డిమాండ్
బెల్ట్ దెబ్బలు.. తొడలపై వాతలు
● కి‘లేడి’ ఆటకట్టించిన పోలీసులు
● మహిళతోపాటు మరో ఇద్దరిపై
కేసు నమోదు
నందిపేట్(ఆర్మూర్): తప్పుడు కేసులతో బెదిరించి డబ్బులు వసూలు చేయాలనుకున్న మహిళతోపాటు మరో ఇద్దరి ఆటకట్టించారు నందిపేట పోలీసులు. ఆర్మూర్ రూరల్ సీఐ జాన్‌రెడ్డి, ఎస్సై శ్యామ్‌రాజ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతానికి చెందిన పిప్పెర అంకిత భర్తతో విడిపోయి ఐదేళ్లుగా నూత్‌పల్లి గ్రామానికి చెందిన సింగారం నవీన్‌తో కలిసి జీవిస్తోంది. ఇరువురికీ ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో ఎవరినైనా బెదిరించి డబ్బులు వసూలు చేద్దామని పతకం పన్నారు. నందిపేట శివారులోని వెంచర్‌లో ప్లాట్ కొనుగోలు చేస్తామని వెంచర్ మేనేజర్ ప్రతాప్‌రెడ్డికి ఫోన్ చేశారు. జక్రాన్‌పల్లి మండలం మునిపల్లిలోని ప్రతాప్‌రెడ్డి ఆఫీస్‌కు వెళ్లి ధర మాట్లాడుతూ గొడవకు దిగారు. అనంతరం తనతో ప్రతాప్‌రెడ్డిరెడ్డి అసభ్యంగా ప్రవర్తించాడని, దాడి చేశాడని అంకిత జక్రాన్‌పల్లి పోలీస్‌ష్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తరువాత వెంచర్ యజమాని వద్ద గతంలో పని చేసిన అంబటి శ్రీనివాస్‌ను సంప్రదించి విషయం తెలిపారు. శ్రీనివాస్, నవీన్, అంకిత ఒక్కటయ్యారు. గతంలో వెంచర్ యజమాని తనతో గొడవపడి కేసులు చేయించాడని, అతడితోపాటు ప్రతాప్‌రెడ్డిపై మరిన్ని కేసులు నమోదు చేయిస్తే తనపై ఉన్న పాత కేసు కొట్టేస్తారని శ్రీనివాస్ అంకిత, నవీన్‌కు తెలిపాడు. వెంటనే వారివురు ప్రతాప్‌రెడ్డికి ఫోన్ చేసి జక్రాన్‌పల్లి స్టేషన్‌లో పెట్టిన కేసు క్లోజ్ చేయాలంటే తమకు రూ.30 లక్షలు ఇవ్వాలని, అంబటి శ్రీనివాస్‌పై పెట్టిన కేసు విత్‌డ్రా చేసుకోవాలని, లేదంటే వెంచరు యజయానితోపాటు నీపై కూడా మరిన్ని కేసులు పెడతామని, రేప్ కేసు కూడా పెడతామని, సుపారీ గ్యాంగ్‌తో చంపేస్తామని బెదిరించారు. డబ్బులు ఇచ్చేది లేదని ప్రతాప్‌రెడ్డి తెగేసి చెప్పడంతో వారిపై తప్పుడు కేసులు చేయించేందుకు పతకం రూపొందించారు.
గుర్తు తెలియని వ్యక్తులు ముసుగులు ధరించి నందిపేటలోని ఐలమ్మ విగ్రహం వద్ద తనపై దాడులు చేశారని వారం రోజుల క్రితం నందిపేట పోలీస్‌స్టేషన్‌లో అంకిత ఫిర్యాదు చేసింది. ముసుగులు ధరించి వచ్చిన వ్యక్తులు తన తొడలపై వాతలు పెట్టారని మళ్లీ ఈ నెల 22వ తేదీన మరో ఫిర్యాదు చేసింది. అంకిత, నవీన్‌ల సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అసలు విషయాలు తెలియడంతో విస్తుపోయారు. ప్రియుడు నవీన్‌తో అంకిత బెల్ట్‌తో కొట్టించుకుని తొడలపై వాతలు పెట్టించుకుందని నిర్ధారణకు వచ్చి ఇద్దరితోపాటు శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అయితే ఈ కేసులో ఇతర వ్యక్తుల పాత్రపై పోలీసులు దర్యాప్తుచేపడుతున్నారు.


