ధర్మారెడ్డి శివారులో చిరుత సంచారం
● పాదముద్రలు సేకరించిన అటవీశాఖ అధికారులు
● ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట మండలం ధర్మారెడ్డి అటవీప్రాంతంలో శనివారం చిరుత సంచరించడంతో పరిసరప్రాంత గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని తాండూర్‌గేట్ సమీపంలో శనివారం ఉదయం చిరుత జాతీయ రహదారిని దాటి ధర్మారెడ్డి అటవీప్రాంతంలోకి వెళ్లడాన్ని స్థానికులు గమనించి, సంబంధిత అధికారులకు తెలియజేశారు. దీంతో నాగిరెడ్డిపేట ఫారెస్ట్‌రేంజ్ అధికారి(ఎఫ్‌ఆర్‌వో) వాసుదేవ్ తన సిబ్బందితో కలిసి ధర్మారెడ్డి బీట్‌లోకి వెళ్లి చిరుత సంచరించిన ప్రాంతంలో పరిశీలించారు. దీంతోపాటు చిరుత పాదముద్రలతోపాటు దాని విసర్జిత పదార్థాలను సేకరించారు. ధర్మారెడ్డి ఫారెస్ట్‌లో చిరుత సంచరిస్తున్న మాట నిజమేనని, ధర్మారెడ్డి ఫారెస్ట్ పరిసరప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎఫ్‌ఆర్‌వో వాసుదేవ్ సూచించారు. డీఆర్‌వో రవికుమార్, ఎఫ్‌బీవో నవీన్, బేస్‌క్యాంప్ సిబ్బంది గోపాల్ తదితరులు ఉన్నారు.


