సర్పంచ్‌గా బాధ్యతలు.. తొలిరోజే హామీల అమలు
మోర్తాడ్: సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించడం కోసం సొంతంగా మేనిఫెస్టోను ప్రకటించిన అభ్యర్థులు వాటిని అమలు చేయడానికి పదవీ బాధ్యతల స్వీకరణ రోజునే నడుం కట్టారు. మోర్తాడ్ మండలం గాండ్లపేట్‌లో సర్పంచ్‌గా పోటీ చేసిన ధని సుభాష్ ఆడపిల్ల పుడితే రూ.5,116 సాయం అందిస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఎన్నికల్లో అతడు గెలిచి, సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా గ్రామానికి చెందిన ముద్దం గోవర్ధన్‌కు ఇటీవల ఆడపిల్ల జన్మించగా సర్పంచ్ సుభాష్ ఇచ్చిన హామీ మేరకు అతడికి రూ.5116 నగదు అందజేశారు. తొలిరోజునే మేనిఫెస్టో అమలు చేసినందుకు సర్పంచ్‌ను గ్రామస్థులు అభినందించారు.
రెంజల్(బోధన్): రెంజల్ మండలం కళ్యాపూర్ సర్పంచ్‌గా పోటీ చేసిన అభ్యర్థి భానుచందర్ ఆడపిల్ల పుట్టిన ప్రతీ కుటుంబానికి అన్నయ్య కానుక కింద రూ.5116 అందిస్తానని మాటిచ్చారు. సోమవారం పదవీ స్వీకారం చేసిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం కాశం సతీష్, అయిటి అనీల్ దంపతులకు ఒక్కోక్కరికి రూ.5116 నగదును అందించి మాట నిలబెట్టుకున్నారు. అలాగే మండలంలోని నీలా గ్రామ సర్పంచ్‌గా తనను గెలిపిస్తే యువతకు వ్యాయామశాలను ఏర్పాటు చేస్తానని క్యాతం యోగేశ్ మాటిచ్చారు. దీంతో బాధ్యతలు స్వీకరించిన వెంటనే గ్రామంలో హనుమాన్ వ్యాయామశాలను ప్రారంభించారు. రూ. 4.20 లక్షల సొంత ఖర్చులతో వ్యాయామశాలకు అవసరమైన పరికారాలను ఏర్పాటు చేశారు.


