ప్రశాంత వాతావరణంలో ఓటింగ్
● విస్తృత ప్రచారంతో పెరిగిన
పోలింగ్ శాతం
● జిల్లా ఎన్నికల అధికారి,
కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
ఆర్మూర్: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో ప్రశాంతంగా ముగిశాయని, ప్ర శాంత వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కు ను వినియోగించుకున్నారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలం అంకాపూర్, బాల్కొండ మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటర్లు, ఎన్నికల సిబ్బందితో మాట్లాడి పలు సూచనలు చే శారు. పోలింగ్ కేంద్రాల్లో హెల్ప్‌డెస్క్‌లు, మెడికల్ క్యాంపులతోపాటు ఇతర సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. మూడు విడతల్లోనూ పో లింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘ టనలు చోటుచేసుకోకుండా ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరిగిందన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు పోలీసు బలగాలతో బందోబ స్తు ఏర్పాటు చేయించడంతోపాటు వెబ్ క్యాస్టింగ్ జరిపించామన్నారు. కలెక్టరేట్ నుంచి సైతం ఆయా పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ ద్వారా ఓటింగ్ తీరును, స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించామని తెలిపారు.
పరిశీలించిన జనరల్ అబ్జర్వర్..
ఎన్నికల సాధారణ పరిశీలకులు శ్యాంప్రసాద్ లాల్ సైతం పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ తీరును పరిశీలించారు. భీమ్‌గల్, బడా భీమ్‌గల్, రామన్నపేట్, మోర్తాడ్, కమ్మర్‌పల్లి, అంకాపూర్, ముప్కాల్, బాల్కొండ తదితర పోలింగ్ కేంద్రాలను సందర్శించారు.


