నైపుణ్యం ఉంటే స్థానికంగానే కంపెనీలు పెట్టొచ్చు
పాపాలను పోగొట్టి అభివృద్ధి దిశగా..
● ఏఐ, రోబోటిక్ సాంకేతిక
పరిజ్ఞానంతోనే భవిష్యత్
● రాష్ట్రప్రభుత్వ సలహాదారు
పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: సాంకేతిక నైపుణ్యం పెంచుకునే దాంట్లో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్ టెక్నాలజీ తదితర వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వ స లహాదారు పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి అన్నారు. జిల్లా లోని కళాశాలల విద్యార్థులకు ‘టెక్నోసాపియన్సిట్ సొల్యూషన్స్’ సాంకేతిక సంస్థ ద్వారా నైపుణ్యాభివృద్ధి కోసం శిక్షణ ఇచ్చేందుకు సన్నాహక సమావేశాన్ని జిల్లా కేంద్రంలోని ఐటీ హబ్‌లో సోమవారం నిర్వహించారు. ఇంజినీరింగ్, పాలిటెక్నికల్, అడ్వాన్స్ డ్ ట్రైనింగ్ సెంటర్ల ప్రిన్సిపాళ్లతో సుదర్శన్‌రెడ్డి మాట్లాడారు. కోర్సులు పూర్తి చేసే దశలో విద్యార్థులకు మా రుతున్న కాలానికి అనుగుణంగా మరింతగా సాంకేతి క నైపుణ్యం అందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టిన ట్లు పేర్కొన్నారు. ఈ శిక్షణ ద్వారా కోర్సు పూర్తి కా గానే విద్యార్థులు మంచి ఉద్యోగాలు సాధించవచ్చని పేర్కొన్నారు. ఉద్యోగాలే కాకుండా స్థానికంగానూ కంపెనీలు ఏర్పాటు చేయొచ్చన్నారు. తద్వారా లోకల్ టాలెంట్‌ను ప్రోత్సహించి ఉద్యోగావకాశాలు సృష్టించవచ్చన్నారు. కోర్సులు పూర్తిచేశాక మరింత నైపుణ్యం కోసం ఇతర నగరాలకు వెళ్లకుండా ఇక్కడే శిక్షణ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలన్నారు. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఆ లోచనలు పంచుకుంటే మంచి ఫలితాలు వస్తాయన్నారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో చేసిన పాపాలను పోగొట్టడంతోపాటు అభివృద్ధి దిశగా ముందుకెళ్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో పాఠశాలల్లో బాలికలకు బాత్‌రూమ్‌లు సైతం లేకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డారని సుదర్శన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నిధులు కేటాయించి సౌకర్యాలు మెరుగుపర్చడంతో విద్యలో ప్రమాణాలు మెరుగుపడ్డాయన్నారు. అడ్మిషన్లు పెరిగాయని తెలిపారు. చదువులో నాణ్యత, పనిలో నైపుణ్యం ఉంటేనే తగిన ఫలితాలు ఉంటాయన్నారు. లేకుంటే ఎన్ని కోర్సులు చేసినా ఉపయోగం ఉండదన్నారు. సమావేశంలో వ్యవసాయ కమిషన్‌సభ్యుడు గడుగు గంగాధర్, నుడా చైర్మన్ కేశ వేణు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, మాజీ మేయర్ ధర్మపురి సంజయ్, నరాల రత్నాకర్, రామర్తి గోపి, పారుపల్లి గంగారెడ్డి, వేణురాజ్ తదితరులు పాల్గొన్నారు.


