ఎరువులను పక్కదారి పట్టిస్తే చర్యలు
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): ఎరువులు పక్కదారి పట్టకుండా గట్టి నిఘా ఉంచాలని, విక్రయాల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి హెచ్చరించారు. జిల్లాలో ప్రస్తుత యాసంగి సీజన్ పంటల సాగు కోసం రైతుల అవసరాలకు సరిపడా యూరియా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఆందోళన చెందొద్దన్నారు. డిచ్‌పల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మండలంలోని సుద్దులం గ్రామంలో నిర్వహిస్తున్న ఎరువుల గోదామును కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలను పరిశీలించారు. ఎరువుల కొనుగోలు చేసేందుకు వచ్చిన రైతులతో మాట్లాడి ఎరువులు అందుతున్నాయా అని ఆరా తీశారు. యాసంగి సీజన్ కు సంబంధించి జిల్లాకు 32 వేల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని, క్రమం తప్పకుండా ఎరువుల స్టాక్ జిల్లాకు వస్తోందని తెలిపారు. నానో యూరియా వాడకం పై రైతులకు అవగాహన కల్పించాలని, డ్రోన్ వినియోగం ద్వారా ఎరువుల వాడకం గురించి ప్రయోగాత్మకంగా అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి వీరాస్వామి, తహసీల్దార్ సతీశ్‌రెడ్డి, మండల వ్యవసాయాధికారి ఆంజనేయులు, సొసైటీ సీఈవో సాయిచంద్, అసిస్టెంట్ సీఈవో సాయిలు, సిబ్బంది శ్రీకాంత్ తదితరులున్నారు.


