ఎన్నికల నియమావళిని పాటించాలి
ఆర్మూర్: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని పాటించాలని సీపీ సాయిచైతన్య సూచించారు. ఆర్మూర్‌లోని ఏసీపీ కార్యాలయంలో డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులతో సీపీ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు శాంతియుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకొనే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సమస్యాత్మక, అతిసమస్మాత్మక పోలింగ్ స్టేషన్‌లను గుర్తించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి నిర్దిష్ట దూరంలో మార్కింగ్ చేయించి, ప్రచారం, గుర్తులను ప్రదర్శించడాన్ని నివారించాలన్నారు. అవసరాన్ని బట్టి స్ట్రైకింగ్ ఫోర్స్ సేవలను వినియోగించుకొని గుంపులను చెదర గొట్టాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని, విధినిర్వహణలో ఎలాంటి లోపాలు కనిపించినా సంబంధిత సిబ్బందిపై తక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆర్మూర్ ఏసీపీ జే వెంకటేశ్వర్‌రెడ్డి , ఆర్మూర్ ఎస్‌హెచ్‌వో పీ సత్యనారాయణగౌడ్ , ఆర్మూర్ రూరల్, భీమ్‌గల్ సీఐలు కే. శ్రీధర్‌రెడ్డి, సతీశ్‌గౌడ్, బాల్కొండ, నందిపేట్, వేల్పూర్, ముప్కాల్, మెండోర, భీమ్‌గల్, మోర్తాడ్, కమ్మర్‌పల్లి, ఏర్గట్ల, మాక్లూర్ ఎస్సైలు శైలేందర్, శ్యామ్‌రాజ్, సంజీవ్, కిరణ్ పాల్, సుహాసిని, సందీప్, రాము, అనిల్‌రెడ్డి, రాజేశ్వర్, రాజశేఖర్ పాల్గొన్నారు.


