కీలక నేతల గ్రామాల్లో భిన్న ఫలితాలు
● కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, బీఆర్‌ఎస్,
వామపక్షాలు
● గడ్కోల్‌లో హోరాహోరీ పోరులో
అధికార పార్టీకి భారీ మెజార్టీ
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : రెండో విడత పంచా యతీ పోరులో అధికార పార్టీ కాంగ్రెస్ ఆధిపత్యం చాటుకున్నప్పటికీ కొన్ని గ్రామాల్లో ఫలితాలు ప్రత్యేకతను చాటుకున్నాయి. సిరికొండ మండలం గడ్కో ల్ పంచాయతీలో కాంగ్రెస్ మద్దతుదారు సాధించిన విజయం చర్చనీయాంశంగా నిలిచింది. ఎస్సీ మహిళకు రిజర్వుడు అయిన ఈ పంచాయతీలో కాంగ్రెస్ తరుఫున డీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్‌రెడ్డి నిలబెట్టిన అభ్యర్థికి పోటీగా బీజేపీ, బీఆర్ ఎస్, వామపక్షాలకు చెందిన రాష్ట్ర, జిల్లా నాయకు లు ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టారు. ఆయా నాయకు లు సైతం ప్రచారం నిర్వహించారు. హోరాహోరీ పోరు జరిగినప్పటికీ భాస్కర్‌రెడ్డి నిలబెట్టిన కాంగ్రె స్ అభ్యర్థే 295 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొంద డం గమనార్హం. గడ్కోల్‌లో మొత్తం 2,716 ఓట్లు ఉన్నాయి. ఈ గ్రామంలో 12 వార్డులకు గాను 8 వార్డులు కాంగ్రెస్ మద్దతుదారులు, 3 వార్డులు బీఆర్‌ఎస్, బీజేపీ, వామపక్షాల కూటమి అభ్యర్థులు, ఒక స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఇదిలా ఉండగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేష్ సొంత గ్రామం డిచ్‌పల్లి మండలం అమృతాపూర్‌లో బీ ఆర్‌ఎస్ మద్దతుదారు గెలుపొందారు. నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి సొంత గ్రామం మోపాల్ మండలం ముదక్‌పల్లిలో ఆయన నిలబెట్టిన అభ్యర్థిపై స్వతంత్ర అభ్యర్థి 398 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందడం విశేషం. పీసీసీ డెలిగేట్ బాడ్సి శేఖర్‌గౌడ్ సొంత గ్రామం మోపాల్ మండలం బాడ్సిలో బీఆర్‌ఎస్ మద్దతుదారుడు గెలుపొందారు. మోపాల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సాయిరెడ్డి సొంత గ్రామమైన మోపాల్ కేంద్రంలో బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. అదేవిధంగా కాంగ్రె స్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ యాదగిరి సొంత గ్రామం మోపాల్ మండలం ఎల్లమ్మకుంటలో బీజేపీ మద్దతుదారుడు గెలుపొందారు. మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సొంత గ్రామం సిరికొండ మండలం చీమన్‌పల్లిలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. డీసీసీ అధ్యక్షుడు నగేష్‌రెడ్డి సొంత గ్రామం డిచ్‌పల్లి మండలం ముల్లంగిలో మాత్రం కాంగ్రెస్ మద్దతుదారే గెలుపొందారు. అదేవిధంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి సొంత గ్రామం నిజామాబాద్ రూరల్ మండలం జలాల్‌పూర్‌లో కాంగ్రెస్ నుంచి ఇద్దరు పోటీపడగా ఒకరు గెలిచారు.


