తిమ్మాపూర్‌లో ఏకగ్రీవాలకు బ్రేక్
మోర్తాడ్: సమష్టి నిర్ణయంతో ఎలాంటి రాజకీయ కక్షలకు తావివ్వకుండా ఏకగ్రీవంగా ప్రజాప్రతినిధులను ఎంపిక చేసి రికార్డు నిలుపుకున్న తిమ్మాపూర్‌లో పోలింగ్ అనివార్యమైంది. ఏకగ్రీవ రికార్డులకు పోలీసుల చర్యలు బ్రేక్ వేయడంతో ఈనెల 17న పంచాయతీ ఎన్నికలలో గ్రామస్తులు ఓటు వేయనున్నారు. తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ 1961లో ఆవిర్భవించింది. అప్పటి నుంచి 2001 వరకు వరుసగా జరిగిన అన్ని పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌లను, వార్డు సభ్యులను, ఉప సర్పంచ్‌ను ఏకగ్రీవంగానే ఎంపిక చేశారు. ఎంపీటీసీ ఎన్నికల్లో సైతం ఎంపీటీసీ సభ్యుడిని, సహకార సంఘం ఎన్నికల్లో డైరెక్టర్లను ఎంపిక చేయడానికి గ్రామస్తులు అంతా సమావేశం నిర్వహించేవారు. ఒక్క మాటపై ప్రజాప్రతినిధులను ఎంపిక చేసి వారి చేతనే నామినేషన్లు దాఖలు చేయించి ఏకగ్రీవంగా ఎంపిక చేసి రికార్డు సృష్టించారు. 2001లో రాజకీయ సమీకరణలు మారడంతో పోటీ అనివార్యమైంది. ఆ తరువాత 2006, 2013లో అభ్యర్థులు ఎక్కువ మంది సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ పడటంతో గ్రామస్తులు ఓట్లు వేసి తమ నాయకులను ఎన్నుకున్నారు. 2019 పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించడానికి అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.15 లక్షల బహుమతి ప్రకటించింది. అప్పట్లో మరోసారి గ్రామస్తులు సమావేశం నిర్వహించుకుని సర్పంచ్, వార్డు సభ్యులు, ఉప సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేసి మరోసారి పాత సంప్రదాయాన్ని ఆచరించారు. ఇప్పటి పంచాయతీ ఎన్నికల్లో బీసీ జనరల్‌కు సర్పంచ్ స్థానం రిజర్వు చేశారు. సర్వ సమాజ్ కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించి తమలో తామే ఓట్లు వేసి అశోక్ యాదవ్ అనే వ్యక్తిని సర్పంచ్ అభ్యర్థిగా ఖరారు చేశారు. సర్వ సమాజ్ కమిటీలో లేని మరో నాయకుడు పుప్పాల నరేష్ తాను కూడా సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నట్లు ప్రకటించడంతో ఏకగ్రీవ ఎంపికకు చెక్ పెట్టినట్లు అయ్యింది. వార్డు స్థానాలకు ఉత్సాహం ఉన్నవారు నామినేషన్‌లు దాఖలు చేయడం, సర్పంచ్ పదవికి ఇద్దరు పోటీ పడుతుండటంతో ఈనెల 17న ఓటింగ్ జరుగనుంది.
ఎన్నో ఏళ్లుగా ఏకగ్రీవ పద్ధతిలోనే
ప్రజాప్రతినిధుల ఎంపిక
2001లో విరామం పలికి 2019లో మరోసారి ఏకగ్రీవ సంప్రదాయం
పాటించిన గ్రామం
ఈ ఎన్నికల్లో ఏకగ్రీవ ఎంపికకు
పోలీసుల చెక్.. అనివార్యమైన పోటీ


