సులేమాన్‌నగర్ శివారులో ఒకరి మృతి
రుద్రూర్: మండలంలోని సులేమాన్‌నగర్ శివారులో మన్నె శ్రీను (43) అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎడపల్లికి చెందిన మన్నె శ్రీను గత నాలుగేళ్ల నుంచి రుద్రూర్ మండలం కొందాపూర్‌లోని తన మేన మామ వద్ద గేదెలు మేపుతూ జీవిస్తున్నాడు. ఈ నెల 9వ తేదీన ఎడపల్లికి వెళ్లిన అతడు.. శనివారం ఉదయం సులేమాన్‌నగర్ శివారులో మృతదేహమై కనిపించాడు. మద్యం సేవించే అలవాటు ఉన్న శ్రీను.. మత్తులో మూత్ర విసర్జనకు నడుచుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు బోర్ల పడి మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. మృతుడి మేనమామ బాల్‌రాజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్ల ఎస్సై సాయన్న తెలిపారు.
ప్రమాదవశాత్తు చెరువులో పడి వృద్ధురాలు..
బాన్సువాడ: పట్టణానికి చెందిన ఉప్పరి లక్ష్మి(65) అనే వృద్ధురాలు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందింది. పట్టణంలో భిక్షాటన చేస్తూ జీవిస్తున్న లక్ష్మి అప్పుడప్పుడు కల్కి చెరువుకు వెళ్లి స్నానం చేసి బట్టలు ఉతుక్కునేది. ఈ నెల 12వ తేదీన చెరువు వద్దకు స్నానానికి వెళ్లిన లక్ష్మి ప్రమాదవశాత్తు కాలు జారి పడి నీట మునిగి చనిపోయింది. మృతురాలి కుమార్తె గంట లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీధర్ తెలిపారు.


