అన్ని ఏర్పాట్లు పూర్తి
● డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను పరిశీలించిన కలెక్టర్, జనరల్ అబ్జర్వర్
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌ను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. పోలింగ్ నిర్వహణ, ఓటరు స మాచార స్లిప్పుల పంపిణీ, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ సామగ్రితో సిబ్బంది తరలింపు, వెబ్ క్యాస్టింగ్ ఏర్పాట్లు, పోలింగ్ కేంద్రాలలో వస తులు, పోలీసు బందోబస్తు, ఎన్నికల ప్రవర్తనా ని యమావళి అమలు, నిఘా బృందాల పనితీరు ప ర్యవేక్షణ తదితర అంశాలపై ఇప్పటికే అన్ని కసరత్తులు పూర్తి చేశామన్నారు. గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికలు ఆదివారం జరుగనున్న నేపథ్యంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎన్నికల సాధారణ పరిశీలకులు జీవీ శ్యాంప్రసాద్ లాల్ శనివారం వేర్వేరుగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను సందర్శించా రు. నిజామాబాద్ డివిజన్‌లోని డిచ్‌పల్లి, ధర్పల్లి, ఇందల్వాయి, మోపాల్, నిజామాబాద్ రూరల్, సిరికొండ, మాక్లూర్, ఆర్మూర్ డివిజన్‌లోని జక్రాన్‌పల్ల్లి మండలాల పరిధిలోని గ్రామ పంచాయతీల కు జరిగే ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సామగ్రి పంపిణీ తీరుతెన్నులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఇందల్వాయి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని తనిఖీ చేసి అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. తాగునీటి వసతి, వైద్య శిబిరం, అల్పాహారం, భోజన వసతి, షామియానాలు ఇతర అన్ని వసతులు ఏర్పాటు చేయగా, పీఓ, ఓపీఓలతో కూడిన బృందాలు హాజరయ్యారా లేదా అని కలెక్టర్ ఆరా తీశారు. ఎలాంటి లోటుపా ట్లు, గందరగోళానికి తావులేకుండా సిబ్బందికి పోలింగ్ సామగ్రిని పక్కాగా అందించాలని, చెక్ లిస్టు ఆధారంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి అందిందా లేదా అన్నది జాగ్రత్తగా పరిశీలించుకోవాలని సూచించారు. సిబ్బందిని తరలించేందుకు సిద్ధంగా ఉంచిన వాహనాలను పరిశీలించి, సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకునేలా పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. డిచ్‌పల్లి, నిజామాబాద్ రూరల్, మాక్లూర్, మోపాల్ తదితర మండల పరిషత్ కార్యాలయాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఎన్నికల సాధారణ పరిశీలకులు శ్యాంప్రసాద్ లాల్ సందర్శించారు. పోలింగ్ మెటీరియల్ పంపిణీ తీరును పరిశీలించారు. పోలింగ్, కౌంటింగ్ పూర్తి పారదర్శకంగా జరిగేలా 56 మంది సూక్ష్మ పరిశీలకులు, 34 మంది జోనల్ అధికారులను నియమించారు. 61 పోలింగ్ కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్ చేయిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.


