నాట్య మయూరి.. ఆద్య
● కూచిపూడి, భరత నాట్యంలో
రాణిస్తున్న మోర్తాడ్ చిన్నారి
మోర్తాడ్: తను గజ్జె కట్టి ఆడితే.. చూడ్డానికి రెండు కళ్లూ చాలవు.. తాను నర్తిస్తుంటే బుజ్జి నెమలే పురివిప్పి నాట్యం చేస్తుందా అన్నట్లుంటుంది. చిరు ప్రాయంలోనే కూచిపూడి, భరత నాట్యంలో రాణిస్తూ అవార్డులు సాధిస్తోంది మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన చిన్నారి కాసర్ల ఆద్య. మూడు నెలల్లోనే రెండు చోట్ల నృత్య ప్రదర్శన చేసి అవార్డులను అందుకుంది. కాసర్ల ప్రియ, ప్రసాద్ కుమార్తె ఆద్య స్థానిక పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. సెలవు రోజుల్లో మెట్‌పల్లిలోని నటరాజ నృత్య కళానికేతన్‌లో మాస్టర్ భూపతి గౌడ్ వద్ద కూచిపూడి, భరత నాట్యంలో శిక్షణ పొందింది. ఇటీవల రవీంద్రభారతి, కరీంనగర్‌లోని కళాభారతిలో నృత్య ప్రదర్శన ఇచ్చి రెండు అవార్డులను అందుకుంది. చిన్న వయస్సులోనే నృత్య ప్రదర్శనలో ప్రావీణ్యం సంపాదించిన చిన్నారిని స్థానికులు అభినందిస్తున్నారు.


