స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ వైపే ప్రజలు
● మొదటి విడతలో 140 సర్పంచ్ స్థానాలు కై వసం
● డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్‌రెడ్డి
నిజామాబాద్ రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజలు ఉన్నారని, ఇందుకు నిదర్శనం మొదటి విడత ఫలితాల్లో 140 స్థానాల్లో పార్టీ మద్ధతుదారులు గెలవడమేనని డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్‌రెడ్డి అన్నారు. నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మొదటి విడతలో 184 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగితే అందులో సుమారు 140 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కై వసం చేసుకుందన్నారు. సర్పంచులుగా గెలిచిన అభ్యర్థులకు అభినందనలు తెలుపుతూనే వారి విజయానికి కారకులైన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినప్పుడు రూ.14వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని 10 సంవత్సరాలలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.84 లక్షల కోట్ల అప్పులోకి లాగిందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ఒకపక్క గత ప్రభుత్వం చేసిన రుణాలకు వడ్డీలు కడుతూనే రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తోందన్నారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పాగంగారెడ్డి, రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ జావిద్ అక్రమ్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణురాజ్, సేవాదల్ అధ్యక్షుడు సంతోష్, ఓబీసీ అధ్యక్షుడు రాజ నరేందర్ గౌడ్, మహమ్మద్ ఈసా, అబ్దుల్ ఎజాజ్, సాయికిరణ్, శివ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


