కుక్కను తప్పించబోయి అదుపుతప్పిన బైక్ : ఒకరి మృతి
రుద్రూర్: పోతంగల్ మండల కేంద్రంలో రోడ్డుపై అడ్డుగా వచ్చిన కుక్కను తప్పించబోచయే క్రమంలో బైక్ అదుపుతప్పి ఒకరు మృతిచెందారు. కోటగిరి ఎస్సై సునీల్ తెలిపిన వివరాలు ఇలా.. మద్నూర్ మండలం సలాబత్‌పూర్ గ్రామానికి చెందిన షేక్ ఖాసీం (42) అనే వ్యక్తి శుక్రవారం కూరగాయలు కొనుగోలు చేయడానికి బైక్ మీద పోతంగల్‌కు బయలుదేరాడు. మండలకేంద్రంలో రోడ్డుపై కుక్క అడ్డం రావడంతో దానిని తప్పించబోయి బైక్ అదుపు తప్పింది. ఈ ఘటనలో అతడు కిందపడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు గుర్తించి అతడిని చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈమేరకు మృతుడి భార్య షేక్ హసీనా ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
కామారెడ్డి క్రైం: కామారెడ్డి మండలంలోని చిన్నమల్లారెడ్డిలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై రంజిత్ తెలిపిన వివరాలు ఇలా.. రామాయంపేటకు చెందిన ఇబ్రహీం(35)కు బాన్సువాడకు చెందిన ఓ మహిళతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. దంపతుల మధ్య గొడవలు రావడంతో కొంతకాలంగా భార్య పిల్లలను తీసుకొని తల్లిగారింట్లో ఉంటోంది. దీంతో ఇబ్రహీం కొంతకాలంగా తన అమ్మమ్మ గ్రామమైన చిన్న మల్లారెడ్డిలో ఉంటూ ప్రైవేటుగా మెకానిక్ పనులు చేస్తున్నాడు. భార్య కాపురానికి రావడం లేదని కొద్దిరోజులుగా అతడు మనస్థాపానికి గురవుతున్నాడు. ఈక్రమంలో శుక్రవారం ఉదయం అతడు జీవితంపై విరక్తి చెంది చిన్నమల్లారెడ్డిలో పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే స్థానికులు గుర్తించి, అతడిని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందాడు. దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


