పల్లె ఓటర్లపై హామీల వర్షం
● సొంత మేనిఫెస్టోతో స్థానిక ఎన్నికల్లో
ప్రచారం చేస్తున్న అభ్యర్థులు
● ఆడపిల్లలకు ప్రాధాన్యత ఇస్తూ
పలు పథకాల ప్రకటన
మోర్తాడ్(బాల్కొండ): సర్పంచ్ పదవిని గెలవడమే లక్ష్యంగా కొందరు అభ్యర్థులు ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నారు. ఇందులో భాగంగా సొంత మేనిఫెస్టోను రూపొందించుకొని మరీ ప్రచారం చేస్తున్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో సర్పంచ్‌లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు రాజకీయ పార్టీల తరహాలో మేనిఫెస్టోలను విడుదల చేశారు. ఇందులో ఆడపిల్ల పుట్టినా, ఆడపిల్లకు పెళ్లి కుదిరినా తమ వంతు సాయంను అభ్యర్థులు ప్రకటించడం విశేషం. కొన్ని చోట్ల ఆడపిల్ల పుడితే రూ.5వేల నుంచి రూ.10వేల వరకూ జమ చేస్తామని హామీ ఇస్తున్నారు. పెళ్లి సాయం కింద రూ.5వేల వరకూ కట్నంను ప్రకటిస్తున్నారు. కొందరైతే సారె ఇస్తామని చెబుతున్నారు. మూడో విడత పోలింగ్ ఈనెల 17న జరుగనుంది. అన్ని రకాల ప్రచారానికి సోమవారంతో తెరపడనుంది. అప్పటిలోగా ఇంటింటికి తమ మేనిఫెస్టో చేరాలనే సంకల్పంతో అభ్యర్థులు కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. అవినీత రహిత పాలన, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం, నల్లా బిల్లును తామే చెల్లిస్తామని, ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరేలా కృషి చేస్తామని హామీలు ఇస్తున్నారు. సాధారణంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సందర్బంలో రాజకీయ పార్టీలు తమ ప్రభుత్వం ఏర్పడాలంటే ఓటర్లను ఆకర్షించేలా మేనిఫెస్టోను ఎన్నికలకు ముందు ప్రకటించడం సాంప్రదాయం. ఇదే వాతావరణంను పంచాయతీ ఎన్నికల సందర్భంలోనూ సర్పంచ్ అభ్యర్థులు గ్రామాలలో విస్తరింప చేయడం గమనార్హం. ఏదేమైనా ఎలాగైనా పంచాయతీ ఎన్నికల్లో నెగ్గాలంటే ఓటర్ల దయ దక్కించుకోవాలనే ఉద్దేశ్యంతో సొంత మేనిఫెస్టోతో అభ్యర్థులు ముందుకు సాగుతున్నారని చెప్పవచ్చు.


