కలవరపెడుతున్న ఫలితాలు
● మెజార్టీ గ్రామాలు హస్తగతమైనా
మేజర్ పంచాయతీలో భిన్నంగా తీర్పు
● ఆందోళనలో మూడో విడత అభ్యర్థులు
మేజర్ పంచాయతీలు..
● పొతంగల్ మండల కేంద్రంలో బీజేపీ అభ్యర్థి శారద విజయం సాధించింది.
● కోటగిరి మండల కేంద్రంలో కాంగ్రెస్ మద్దతుదారులు బర్ల మధుకర్‌ను గెలిపించారు.
● రుద్రూర్ జీపీలో కాంగ్రెస్ మద్దతుదారులు ఇందూర్ సునీతను గెలిపించారు.
● వర్ని మండలం సత్యనారాయణపురంలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి కనకదుర్గ విజయం సాధించారు.
● చందూర్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థి మాధవరెడ్డి సర్పంచ్‌గా విజయం సాధించారు.
● మోస్రాలో బీజేపీ అభ్యర్థి భూపాల్‌రెడ్డిని ఓటర్లు గెలిపించారు.
బాన్సువాడ : మొదటి విడత ఫలితాలు కలవరపెడుతున్నాయి. మెజారిటీ గ్రామాల్లో పైచేయి ఉన్నప్పటికి మేజర్ పంచాయతీలలో మాత్రం అందుకు భిన్నంగా తీర్పు వెలువడింది. బాన్సువాడ నియోజకవర్గం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో సగం సగం ఉంది. నిజామాబాద్ జిలాల్లో ఉన్న మండలాల్లో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరుగగా మిగతా మండలాల్లో మూడో విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. నియోజకవర్గంలోని పొతంగల్, కోటగిరి, రుద్రూర్, వర్ని, చందూర్, మోస్రా మండలాల్లో మొదటి విడత ఎన్నికలు జరిగాయి. ఆయా మండలాల్లో మెజారిటీ పంచాయతీలు హస్త గతమయ్యాయి.
కానీ మేజర్ పంచాయితీల్లో మాత్రం ఓటర్ల తీర్పు భిన్నంగా వచ్చింది. మూడో విడతలో కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. అయితే ఆయా మండలాల్లో చాలా పంచాయతీలు, గిరిజన తండాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా గ్రామాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మొదటి విడతలో వచ్చిన ఎన్నికల ఫలితాలు చూసి మూడో విడతలో ఎన్నికలు జరిగే గ్రామాల్లో అభ్యర్థులు భయాందోళనకు గురవుతున్నారు. ఓటర్ల నాడి తెలుసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికి వారి నాడి అంతుచిక్కడం లేదని తలలు పట్టుకుంటున్నారు. ఓటర్లకు రాచ మర్యాదలు చేస్తూ ఎక్కడా లేని ప్రేమలు ఒలకబోస్తున్నారు. భారీ సంఖ్యలో మహిళలను వెంట బెట్టుకుని ప్రచారం కొనసాగిస్తున్నారు. మేజర్ గ్రామ పంచాయతీల్లో ఓటర్ల తీర్పుపై సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా బీర్కూర్, నస్రుల్లాబాద్, బాన్సువాడ మండలాల్లోని మేజర్ పంచాయతీలలో రెబెల్ బెడద ఉంది.


