బస్సు అద్దాలు ధ్వంసం చేసిన యువకుడు
పెద్దకొడప్‌గల్(జుక్కల్): మండల కేంద్రంలో ఓ యువకుడు బస్సు అద్దాలను ధ్వంసం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా.. హైదరాబాద్ డిపో–2కు చెందిన బస్సు శుక్రవారం బిచ్కుంద నుంచి పెద్దకొడప్‌గల్ మీదుగా హైదరాబాద్‌కి బయలుదేరింది. మండలకేంద్రంలో ఓ యువకుడు బస్సెక్కి చిన్నకొడప్‌గల్‌కు టికెట్ ఇవ్వమని కండక్టర్‌ను కోరాడు. దీంతో కండక్టర్ చిన్నకొడప్‌గల్‌కు స్టాప్ లేదని చెప్పి, అతడిని బస్సు దిగమని సూచించాడు. సదరు యువకుడు బస్సు దిగి రాయితో బస్సు వెనక అద్దాలను ధ్వంసం చేశాడు. వెంటనే డ్రైవర్ బస్సు ఆపి, యువకుడిని వెంబడించి పట్టుకున్నారు. అతడిని పోలీసులకు అప్పగించి, ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.


