పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
నిజామాబాద్ అర్బన్: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని సూచించారు. పంచాయతీ ఎన్నికలపై బుధవారం కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్‌కుమార్, అదనపు డీసీపీ బస్వారెడ్డి వీసీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు మూడు విడతలలో ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేసినట్లు గుర్తుచేశారు. డిసెంబర్ 11న మొదటి విడత, 14న రెండో విడత, 17న మూడో విడత పోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. గ్రామాల వారీగా అప్‌డేట్ చేసిన రిజర్వేషన్లు, ఏ విడతలో పోలింగ్ ఉంటుంది, పోలింగ్ కేంద్రాల జియో లొకేషన్ తదితర వివరాలను వెంటనే టీపోల్ వెబ్‌సైట్, యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. టీపోల్ వెబ్‌సైట్, యాప్‌లో వచ్చే ఫిర్యాదుల పరిష్కారం కోసం నోడల్ అధికారిని నియమించాలని, ఫిర్యాదులను మూడు రోజులలో పరిష్కరించాలన్నారు. ఈ నెల 23న ఖరారు చేసిన తుది ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితాను అనుసరిస్తూ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాలలో వెలుతురు, ఫర్నిచర్, విద్యుత్ సరఫరా, తాగునీరు, టాయిలెట్స్ వంటి కనీస వసతులు ఉండేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు. వెబ్ కాస్టింగ్ జరిగే పోలింగ్ కేంద్రాల వివరాలు పంపాలన్నారు.
మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ గురువారం ఉదయం 10.30 గంటల వరకు విడుదల చేయాలని సూచించారు. 27 నుంచి 29 వరకు ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరించాలన్నారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, అభ్యంతరాల పరిష్కారం, గుర్తుల కేటాయింపు, పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన పకడ్బందీగా జరిగేలా జిల్లా ఎన్నికల అధికారులు పర్యవేక్షణ చేస్తూ, అవసరమైన మార్గదర్శకాలు జారీ చేయాలన్నారు. అనుమతి లేకుండా ఎన్నికల ప్రచార కరపత్రాల ముద్రణ చేయకూడదంటూ ప్రింటర్లకు ఆదేశాలు జారీ చేయాలని సూచించారు. ప్రతి మండలానికి ఒక ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం, ఒక ఏఈవో (సహాయ వ్యయ వివరాల నమోదు అధికారి), జిల్లాకు ఒక స్టాటిక్ సర్వేలైన్స్ బృందం ఏర్పాటు చేసి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు తప్పనిసరిగా జరిగేలా పర్యవేక్షించాలని అన్నారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి అభ్యర్థుల వ్యయ వివరాలను నమోదు చేసేందుకు ధరలను ఖరారు చేయాలని తెలిపారు. జిల్లా స్థాయిలో ఎంసీఎంసీ కమిటీ, మీడియా సెల్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల ప్రచార సమయంలో వినియోగించే ఎలక్ట్రానిక్ వీడియోలకు ముందుగా ఎంసీఎంసీ అనుమతి ఉండాలన్నారు.
ఎన్నికల దృష్ట్యా తనిఖీలు నిర్వహించే నేపథ్యంలో రైతులు పంట డబ్బులు తీసుకుని వెళ్లే సమయంలో తప్పనిసరిగా రశీదు పెట్టుకునేలా అవగాహన కల్పించాలన్నారు. తనిఖీలలో నగదు, బంగారం, ఇతర పరికరాలు సీజ్ చేసే సమయంలో తప్పనిసరిగా రశీదు అందించాలన్నారు. సీజ్ చేసిన పరికరాలకు సంబంధించిన ఆధారాలు సమర్పించేందుకు ఏ అధికారి ఎదుట హాజరుకావాలనే వివరాలు రశీదులో తెలపాలన్నారు. వీసీలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, నోడల్ అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం
కమిషనర్ రాణి కుముదిని
ఎన్నికల ప్రవర్తనా నియమావళి
కట్టుదిట్టంగా అమలు
మొదటి విడత నోటిఫికేషన్
సజావుగా జారీ చేయాలి
వీసీలో అధికారులను ఆదేశించిన
కమిషనర్


