సుభాష్‌నగర్: జిల్లాలో నిలిచిపోయిన రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ఎట్టకేలకు మొదలయ్యాయి. కొన్ని నెలల తర్వాత ఆర్‌వోబీ పనులు వేగం పుంజు కున్నాయి. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో అర్సపల్లి, అడివి మామిడిపల్లి ఆర్‌వోబీలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్య పద్ధతిలో మాధవనగర్ ఆర్‌వోబీ పనులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్నా.. గత ప్రభుత్వ పాలనలో నిర్మాణ పనులు నత్తనడనక సా గాయి. గత సర్కారు నిధులను దారి మళ్లీంచడమే జాప్యానికి కారణమని బీజేపీ ఆరోపించింది.
కాలయాపన..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కొన్ని నెలలపాటు పనులు సవ్యంగా సాగినా.. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నిధుల విడుదలలో జాప్యం ఏర్పడింది. గుత్తేదారులు కూడా పనులు చేయలేక కాలయాపన చేశారు. జిల్లావాసుల దశాబ్దాల కల అయిన మాధవనగర్ ఆర్‌వోబీ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎంపీ అర్వింద్ పనులు వేగవంతం చేయాలని తరచూ సమీక్షల్లో అటు అధికారులు, ఇటు గుత్తేదారుల మీద ఒత్తిడి పెంచారు. నిధులు విడుదల చేయాలని గతేడాది డిసెంబర్‌లో నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ తర్వాత నిధులు విడుదల చేయడంతో కొన్ని నెలలపాటు పనులు ముందుకు సాగాయి. మళ్లీ నెలల తరబడి బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో కాంట్రాక్టర్లు పనులు నిలిపేశారు. అదే సమయంలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నిధులు కేంద్రం వద్దే పెండింగ్‌లో ఉన్నాయనడంతో బీజేపీ ఎంపీ సహా జిల్లా నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం వద్దే బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని తేదీలతో సహా ఎంపీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. ఒక దశలో నిధులు విడుదల చేయకుంటే నిరాహార దీక్షకు దిగుతానని ఎంపీ అల్టీమేటం చేశారు. గత నెల 29న పెండింగ్ బిల్లులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలవగా, విడుదల చేస్తానని హామీనిచ్చిన విషయం తెలిసిందే.
ఊపిరి పీల్చుకున్న కాంట్రాక్టర్లు..
మాధవనగర్ ఆర్‌వోబీకి రూ.3.15 కోట్లు, అర్సపల్లి ఆర్‌వోబీకి రూ.7.46 కోట్లు, అడవి మామిడిపల్లి ఆర్‌వోబీకి రూ.3 కోట్లు విడుదల కావడంతో కాంట్రాక్టర్లు ఊపిరి పీల్చుకున్నారు. మాధవనగర్ ఆర్‌వోబీ పనులు వారం నుంచే కొనసాగుతుండగా, రెండ్రోజుల్లో అడవి మామిడిపల్లి వద్ద బీటీ రోడ్డు పనులు ప్రారంభం కానున్నాయి. ఈ పనులు వారం, పదిరోజుల్లో పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించారు. ఆర్‌వోబీ పనులు ప్రారంభం పట్ల ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
నిధుల కోసం సీఎం,
డిప్యూటీ సీఎంను కలిసిన ఎంపీ అర్వింద్
పది రోజుల క్రితం కాంట్రాక్టర్లకు
బిల్లుల చెల్లింపు
ఎట్టకేలకు ప్రారంభమైన
ఆర్వోబీ నిర్మాణ పనులు


