రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేయాలి
● దేశ చరిత్రను తిరగరాసే
కుట్ర జరుగుతోంది
● పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
నిజామాబాద్ రూరల్: ప్రతి పౌరుడు రాజ్యాంగ పరిరక్షణకు తమ వంతు కృషి చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. రాజ్యాంగ వజ్రోత్సవాల్లో భాగంగా నగరంలోని ఫులాంగ్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రపంచంలోకెల్లా గొప్ప రాజ్యాంగమని కొనియాడారు. దేశంలో కొన్ని అరాచక శక్తులు రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాయని, గాంధీ, నెహ్రూను మరిపించి దేశ చరిత్రను తిరగరాసే కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. అరాచక శక్తుల కుట్రలను విద్యావంతులు, మేధావులు తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. కార్యక్రమంలో రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ రాంగోపాల్, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ రాజేంద్రప్రసాద్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బంటు బలరాం, మాజీ కార్పొరేటర్ నరేందర్ గౌడ్, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి నాగరాజు, మైనారిటీ జిల్లా ఉపాధ్యక్షుడు అజీమ్ తదితరులు పాల్గొన్నారు.


