చిక్కరు.. చిక్కనివ్వరు..
● ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో పోలీసులు ఇటీవల పేకాడుతున్న 13 మందిని అరెస్టు చేసి రూ. 3 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
● ఇటీవల వినాయక్‌నగర్‌లోని బస్వా గార్డెన్ సమీపంలో పేకాట కేంద్రంపై పోలీసులు దాడులు చేశారు. పేకాడుతున్న 9 మందిని అరెస్టు చేసి రూ.20 వేల నగదు
స్వాధీనం చేసుకున్నారు. అయితే, గత కొన్నేళ్లుగా ఇక్కడ పేకాట ఆడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
● తాజాగా సోమవారం పోలీసులు ధర్మపురిహిల్స్‌లో పేకాడుతున్న 9 మందిని అరెస్టు చేసి రూ.51వేలు, సెల్‌ఫోన్లు, బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు.
నిజామాబాద్‌అర్బన్ : జిల్లాలో పేకాట కేంద్రాలు అనేక చోట్ల వెలుస్తున్నాయి. ఇందులో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని హమాల్‌వాడీ ప్రాంతంలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు కొన్నేళ్లుగా పేకాట కేంద్రాలు నిర్వహిస్తున్నారు. రాత్రింబవళ్లు పేకాట జోరుగా సాగుతోంది. దుబ్బా ప్రాంతంలోని తెలుగుదేశం జెండా సమీపంలో ఓ మాజీ ప్రజాప్రతినిధి తన ఇంటినే పేకాట కేంద్రంగా మార్చాడు. ఈ నేత గతంలో అధికార పార్టీలో ఉండగా పోలీసుల దాడి జరిగింది. అయితే, అధికారాన్ని ఉపయోగించుకొని కేసు కాకుండా తప్పించుకున్నాడు. గతంలో అధికారంలో ఉన్న పార్టీ యువజన విభాగం నాయకుడు గిరిరాజ్ కళాశాల సమీపంలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకొని పేకాట దందా నిర్వహిస్తున్నాడు. ప్రధానంగా హాస్టల్, కళాశాల విద్యార్థులకు గంజాయి సరఫరా కొనసాగిస్తూ రాత్రివేళల్లో తన భవనంపై పేకాట కొనసాగిస్తూ వస్తున్నాడు. వినాయక్‌నగర్‌లోని ఓ ఫంక్షన్ హాల్ సమీపంలో ఓ మాజీ ప్రజాప్రతినిధి ఓ ఇంటిని కొనుగోలు చేసి పైభాగాన్ని పేకాట కేంద్రంగా మార్చాడు. ఈ కేంద్రానికి వచ్చే వారు కాలినడకన రావాలని సూచిస్తాడు. ఆ సూచనలు పాటిస్తూ నిత్యం 20 నుంచి 30 మంది పేకాడుతారు. గంగస్థాన్ ఫేస్–2లోని ఓ అపార్ట్‌మెంట్ మూడో అంతస్తులో ప్రతిరోజు పేకాట కొనసాగుతుంది. ఓ కాంట్రాక్టర్, మాజీ ప్రజాప్రతినిధి నిర్వహిస్తున్న ఈ కేంద్రానికి స్థానికులకు మాత్రమే అవకాశం ఉంటుంది. మాక్లూర్ మండలానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి భర్త కొన్నేళ్లుగా పేకాట కేంద్రాల నిర్వహణను వృత్తిగా మార్చుకున్నాడు. జిల్లా కేంద్రంతోపాటు మాక్లూర్ మండలం చిన్నాపూర్, అడవి మామిడిపల్లి, హైదరాబాద్‌లోని శివారు ప్రాంతాలు, మహారాష్ట్రలోని నయాగంలో పేకాట జోరుగా కొనసాగిస్తున్నారు. గతంలో పోలీసులు దాడులు జరపగా నాటి ప్రజా ప్రతినిధితో సిఫార్సుతో తప్పించుకు న్నాడు. ప్రస్తుతం జిల్లా కేంద్రంతోపాటు ఇతర ప్రాంతాలలో పేకాట కేంద్రాలను కొనసాగిస్తున్నా డు. లక్ష్మీ ప్రియనగర్ కాలనీలోని ఓ మాజీ ప్రజాప్రతినిధి గతేడాది ఓ ఇంటిని కొనుగోలు చేశాడు. ఇక్కడ పేకాట కేంద్రం నిర్వహించడంతోపాటు ఆడేవారికి మద్యాన్ని కూడా సరఫరా చేస్తుండడం విశేషం. ఆర్మూర్ ప్రాంతంలోని ఓ ఫామ్‌హౌస్‌లో గతంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకుడు పేకాట కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. నిజామాబాద్ నగరంలోని ఐదో స్టేషన్ పరిధిలో మాజీ కార్పొరేటర్, రౌడీషీటర్‌గా పేరొందిన ఇద్దరు గంజాయి విక్రయాలతోపాటు పేకాట, మట్కా కేంద్రాలను కొనసాగిస్తున్నారు. మాజీ కార్పొరేటర్ భర్త సుభాష్‌నగర్‌లోని తన ఇంటి సమీపంలోనే పేకాట కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు.
మామూళ్లు.. సిఫారసులు
కొన్నేళ్లుగా పేకాట కేంద్రాలను నిర్వహిస్తున్న వారు పోలీసులకు దొరికిన సందర్భాలు చాలా తక్కువ. ఒకవేళ దొరికితే ప్రజాప్రతినిధులతో సిఫార్సు చేసుకొని తప్పించుకుంటున్నారనే విమర్శలున్నాయి. స్థానిక ఎస్సైలు, సీఐలకు మామూ ళ్లు అందజేస్తూ యథేచ్ఛగా పేకాట కేంద్రాలను నిర్వహిస్తున్నారనే విమర్శలున్నాయి. 20 నుంచి 30 మంది వరకు ఏకధాటిగా పేకాడితే ఒక్కో పోలీస్ స్టేషన్ అధికారికి నెలకు రూ.40 వేల నుంచి రూ. 50 వేల వరకు ముట్టజెప్పుతున్నట్లు తెలిసింది. తరచూ స్థలాలు మారుస్తూ పేకాట నిర్వహించే వారు ప్రతి నెలా రూ. 20 వేల వరకు అందజేస్తారనే సమాచారం. పేకాట నిర్వహణపై ఎవరైనా పోలీసులకు సమాచారం అందిస్తే కొందరు పోలీసులు వెంటనే నిర్వాహకులకు తెలిపి తప్పిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేకాట దందాలో సంపాదించిన డబ్బులతో మాక్లూర్ మండలానికి చెందిన ఓ మాజీ ప్రజా ప్రతినిధి భర్త భూములు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. హమాల్‌వాడీలో పేకాట కేంద్రాన్ని కొనసాగిస్తున్న అధికార పార్టీ నాయకుడు.. పార్టీలు మారినా, పోలీసులు మారినా ఒ క్కసారి కూడా చిక్కలేదు. ఇప్పటికై నా పోలీస్ కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించి పేకాట కేంద్రా ల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
జిల్లాలో పేకాట జోరుగా నడుస్తోంది. కట్టడి చేయాల్సిన పోలీసులు నామమాత్రపు దాడులు నిర్వహిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. అడపాదడపా పేకాట ఆడేవారిని అరెస్టు చేస్తున్నారే తప్ప దీర్ఘకాలంగా పేకాట కేంద్రాలను నిర్వహిస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. నిర్వాహకులతో కొంతమంది పోలీసులకు సంబంధాలుండటంతోనే ఏళ్లపాటుగా పేకాట కేంద్రాలు నడుస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కఠిన చర్యలు తీసుకుంటాం
పేకాట స్థావరాలపై దాడులు చేస్తున్నాం. చాలా వరకు అరికడుతున్నాం. పేకాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయి. పేకాట ఆడి జీవితం నాశనం చేసుకోవద్దు. ఎవరైనా పేకాట ఆడితే పోలీసులకు సమాచారం ఇవ్వండి.
– రాజా వెంకట్‌రెడ్డి, ఏసీపీ, నిజామాబాద్
జోరుగా పేకాట దందా
కొందరు మాజీ ప్రజాప్రతినిధులే
నిర్వాహకులు!
విచ్చలవిడిగా అడ్డాలు
నామమాత్రంగా పోలీసుల దాడులు
పట్టుబడకుండా మామూళ్లు..
కేసుల్లేకుండా సిఫారసులు


