నవనాథ గిరికి ప్రదక్షిణ
● వైభవంగా సప్తహారతి
● మంగళహారతులతో తరలివచ్చిన మహిళా భక్తులు
ఆర్మూర్: ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన పట్టణంలోని నవనాథుల సిద్ధులగుట్టపై కొలువైన హరిహరులకు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సప్తహారతి, గిరి ప్రదక్షిణను మంగళవారం రాత్రి కనుల పండుగగా నిర్వహించారు. సిద్ధులగుట్ట ఘాట్ రోడ్డు మార్గంలోని ఎల్లమ్మ ఆలయం నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి, సిద్ధులగుట్ట, నందిపేట కేదారీశ్వరాలయాలకు చెందిన నందీశ్వరమహారాజ్, మంగి రాములు మహారాజ్ ప్రత్యేక పూజలు నిర్వహించి గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. హరిహరులతో పాటు అన్నపూర్ణమాత, సీతారామ లక్ష్మణ, ఆంజనేయ, గణపతి, అయ్యప్పస్వామి ఉత్సవ విగ్రహాలు కొలువైన రథం ముందు మహిళలు, భక్తులు మంగళహారతులు, బోనాలతో నడిచారు. వేద పండితులు ఎల్లమ్మ మందిరంతోపాటు ఆలూరు రోడ్డులోని కాశీ హనుమాన్, జెండాగుడి, కోలి హనుమాన్ ఆలయం, గోల్ బంగ్లా, జమ్మి హనుమాన్, అంబేద్కర్ చౌరస్తాలో సప్త హారతులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గిరి ప్రదక్షిణ అనంతరం ఘాట్ రోడ్డు మీదుగా నవనాథ సిద్ధేశ్వరుని ఆలయం వరకు రథయాత్ర సాగింది. ఆలయ ప్రధాన అర్చకులు గంగకుమార్ శర్మ, ఉత్సవ కమిటీ ప్రతినిధులు భారత్ గ్యాస్ సుమన్, పీసీ భోజన్న, రామాగౌడ్, చరణ్‌రెడ్డి, ప్రశాంత్, సతీశ్, బటుట శంకర్, శ్రీనివాస్, ఆర్మూర్ సర్వసమాజ్ అధ్యక్షుడు కొట్టాల సుమన్, శ్రీనివాస్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు తదితరులు పాల్గొన్నారు.


