ఇంటి పన్ను వసూళ్లపై దృష్టి పెట్టాలి
● జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌రావు
మోపాల్: జిల్లాలోని 545 గ్రామపంచాయతీల్లో ఇంటి పన్నుల వసూళ్లపై పంచాయతీ కార్యదర్శులు దృష్టి సారించాలని జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) శ్రీనివాస్‌రావు సూచించారు. మంగళవారం మండలంలోని తాడెం గ్రామాన్ని డీపీవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామ పంచాయతీలో రికార్డులను పరిశీలించారు. తడి, పొడి చెత్త నిర్వహణ, డంపింగ్‌యార్డు, నర్సరీని సందర్శించి సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు. అనంతరం డీపీవో మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా రూ. 30.85 కోట్ల పన్నులు డిమాండ్ ఉండగా, ఇప్పటి వరకు రూ.8.36 కోట్లు వసూలయ్యాయని తెలిపారు. ఇంకా రూ.22.49 కోట్లు కావాల్సి ఉందని, ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి వందశాతం పూర్తి చేసేలా కార్యచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు. తడి, పొడి చెత్త నిర్వహణతో తయారయ్యే ఎరువులు మొక్కలకు వేసుకోవచ్చని, మిగిలిన ఎరువులు అమ్మితే జీపీకి ఆదాయం సమకూరుతుందని అన్నారు. నర్సరీలను సిద్ధం చేసుకోవాలని, ప్రజలకు, జీపీకి అవసరమయ్యే మొక్కలను పెంచాలన్నారు. అనంతరం ఇంటి పన్నుల వసూలు ప్రక్రియను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీవో కిరణ్‌కుమార్, జీపీ కార్యదర్శి మృదుల తదితరులు ఉన్నారు.


