డొంకేశ్వర్(ఆర్మూర్): ఉపాధి హామీ పథకంలో అవినీతి పశువుల పాక వరకు చేరింది. చేయి తడిపితే చాలు అది ఫంక్షన్ హాల్ అయినా సరే దానిని పశువుల షెడ్డుగా మార్చేస్తాం.. నిధులు కూడా మంజూరు చేయిస్తామంటున్నారు జిల్లాలో పని చేస్తున్న కొందరు ఉపాధి హామీ ఉద్యోగులు.
నిబంధనలు తుంగలో తొక్కి అనర్హులకు, బినామీలకు అవకాశం కల్పిస్తున్నారు. దీంతో ఉపాధి హామీ పథకం దుర్వినియోగం అవుతోంది.
నిజంగా పశువుల షెడ్డు కట్టుకుంటామని ముందుకొచ్చిన వారికి మాత్రం అధికారులు కొర్రీలు పెట్టి ఆఫీసుల చుట్టూ తిప్పించుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ఉపాధి హామీ పథకం కింద జాబ్ కార్డు ఉండి పశువులు, గొర్రెలు ఉన్న రైతుకు షెడ్డు నిర్మించుకోవడానికి పూర్తి సబ్సిడీ ఇస్తోంది. ఒక్కో యూనిట్‌కు రూ.1లక్ష దాకా ప్రభుత్వం ఇస్తుడండంతో జిల్లాలో గత రెండేళ్లలో 237మంది ముందుకు వచ్చారు. ఇందులో కొన్ని పూర్తి కాగా మరికొన్ని పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఉపాధి హామీ సిబ్బంది ముడుపులకు ఆశపడి ఎవరికి పడితే వారికి మంజూరు చేయిస్తున్నారు. లబ్ధిదారులు వేరే వ్యక్తులున్నా, సర్వే నంబర్లు, స్థలాలు వేరుగా ఉన్నా కూడా సంతకాలు చేసేస్తున్నారు. పాత వాటికి కూడా బిల్లులు ఇస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇందుకు మండల స్థాయి నుంచి జిల్లా కార్యాలయం వరకు ముడుపులు వెళ్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
డొంకేశ్వర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి గతంలోనే ఉపాధి హామీ పథకం కింద పశువుల షెడ్డు నిర్మించుకుని లబ్ధి పొందాడు. మళ్లీ పశువుల షెడ్డు కోసం ఇటీవల దరఖాస్తు పెట్టుకున్నాడు. తన పేరుపై దరఖాస్తు పెడితే రాదనే ఉద్దేశంతో వేరే వ్యక్తి పేరుతో పత్రాలు సమర్పించాడు. ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ అంతా సవ్యంగా ఉందని ఎస్టిమేషన్లు వేసి ఉన్నతాధికారులకు పంపిన వెంటనే మంజూరు వచ్చింది. దీనిపై స్థానిక అధికారులకు ఫిర్యాదులు అందడంతో వేరే సిబ్బందితో విచారణ చేయించారు. విచారణకు వెళ్లిన సిబ్బంది పశువుల షెడ్డు పెద్దగా ఉన్నట్లు గుర్తించారు. బినామీ పేరుతో రెండోసారి పశువుల షెడ్డు నిర్మించుకున్నట్లు విచారణలో తేలింది. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా కాసులకు కక్కుర్తిపడి కొంత మంది ఉపాధి హామీ సిబ్బంది నిబంధనలను తుంగలో తొక్కి పశువుల, గొర్రెల షెడ్లకు నిధులు మంజూరు చేయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
దుర్వినియోగం అవుతున్న
ఉపాధి హామీ పథకం
నిబంధనలు ఉల్లంఘించి
బినామీలకు సైతం అనుమతులు
అసలైన లబ్ధిదారులు ముందుకొస్తే
కొర్రీలు పెడుతున్న అధికారులు


